
మజీద్‌పల్లిలో వెటర్నరీ బృందం
● కోళ్లఫారాలు పరిశీలన ● కోళ్ల మృతిపై ఆందోళన వద్దు ● జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ వెల్లడి
వర్గల్(గజ్వేల్): మజీద్‌పల్లిలోని కోళ్ల ఫారాలను వెటర్నరీ బృందం సందర్శించింది. ‘కోళ్లకు ఏమైంది’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ అశోక్‌కుమార్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలన, వివరాలు శాంపిల్స్ సేకరణ నిమిత్తం సిద్దిపేట ఏడీ కొండల్‌రెడ్డి, సంగారెడ్డి పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ పవన్‌కుమార్, వేలూరు పశువైద్యాధికారి డాక్టర్ సర్వోత్తమ్‌తో కూడిన బృందాన్ని వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామానికి పంపించారు. క్షేత్రస్థాయిలో వీరు కోళ్ల ఫారాలను పరిశీలించారు. కోళ్లు చనిపోయిన తీరు, తదితర వివరాలను సేకరించారు. కోడిపిల్లలను అందజేసే కంపెనీ సంబంధీకులు ముందురోజే మిగతా కోళ్లను ‘కల్లింగ్’ చేసి తరలించినట్లు, కోళ్ల ఫారాలను శానిటైజ్ చేయించినట్లు గుర్తించారు. ఫారాలలో కోళ్లు లేకపోవడంతో శాంపిల్స్ సేకరించలేదు. పౌల్ట్రీ నిర్వాహకులకు, కోడిపిల్లలు ఇచ్చే కంపెనీల ప్రతినిధులకు పలు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. పౌల్ట్రీ రైతులు తమ ఫారాలలో పెద్దసంఖ్యలో కోళ్లు మృతిచెందినట్లు గమనిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కోళ్ల మృతిపై జేడీ ద్వారా ఉన్నతాధికారులకునివేదిస్తామన్నారు.
చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు
కోళ్ల మృతిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉడకబెట్టిన వంటకాలలో వైరస్ ప్రభావం ఉండదన్నారు. చికెన్ తదితర వంటకాలను 100 డిగ్రీల ఉష్ణోగ్రత దాకా ఉడికించి తయారుచేయడం సాధారణమేనన్నారు. అందువల్ల వైరస్ ప్రభావం ఎంత మాత్రం ఉండదని, చికెన్‌పై, కోళ్ల మృతిపై ఆందోళన అవసరం జేడీ స్పష్టం చేశారు.

మజీద్‌పల్లిలో వెటర్నరీ బృందం
Comments
Please login to add a commentAdd a comment