
మా ఊరి నుంచి నీరివ్వం..
కాలువలో బండరాళ్లు,మట్టివేసి పూడ్చివేత
● బీఆర్‌ఎస్ నాయకుల నిర్వాకం ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
కోహెడరూరల్(హుస్నాబాద్): మా ఊరి ప్రాజెక్టు నుంచి ఇతర గ్రామాలకు నీటిని తరలించేది లేదంటూ స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు కొందరు కాలువలో బండరాళ్లు, మట్టిని వేసి పూడ్చివేశారు. ఈ ఘటన కోహెడ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫలితంగా మూడు గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల్లో వరి పంటలకు నీరందని పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి మండలంలో పర్యటించినప్పుడు పలు గ్రామాల రైతులు పంటలు ఎండుతున్నాయని శనిగరం ప్రాజెక్టు నుంచి మోయతుమ్మెదవాగు ద్వారా నీటిని విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. వారు వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఈఈ, డీఈకి ఆదేశాలిచ్చారు. సాక్షాత్తు మంత్రి, కలెక్టర్ ఆదేశించినా శనిగరం గ్రామానికి చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుచెబుతుండటం గమనార్హం. నీరు వచ్చే కాలువలో బండరాళ్లు, మట్టిని వేసి పూడ్చి వేశారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. నీటి కాలువలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు ఎండుతున్నా బీఆర్‌ఎస్ నాయకుల ప్రవర్తన విచిత్రంగా ఉందంటూ వాపోయారు. వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment