
మహనీయుల చరిత్రను చాటుదాం
సమష్టిగా పనిచేద్దాం.. లక్ష్యం సాధిద్దాం
● పన్నుల వసూలులో మున్సిపాలిటీని అగ్రగామిగా నిలుపుదాం
● చైర్‌పర్సన్ మంజుల
సిద్దిపేటజోన్: ఆస్తి పన్ను, నల్లా పన్నులు వందశాతం వసూలు చేసి రాష్ట్రంలో సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలుపుదామని చైర్ పర్సన్ మంజుల సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు పాలకవర్గం, అధికార యంత్రాంగం సమష్టిగా లక్ష్యం సాధించాలన్నారు. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది గురువారం నాటికి రూ.14.28కోట్లు వసూలు చేసిందని, మిగతా రూ.1.36 కోట్లను వసూలు చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన మున్సిపల్ రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు సరఫరా లేని ప్రత్యేక కేసులను అధికారులు పరిశీలించాలన్నారు. అలాగే పట్టణంలో చాలా పురాతన ఇళ్లు ఉన్నాయని, వాటికి ఫ్యామిలీ మెంబర్, మరణ పత్రాల ఆధారంగా పేర్ల మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో పట్టణంలో నీటి నల్లా కనెక్షన్లు ఉండి తాగునీరు రాని వాటిపై సమీక్ష చేస్తామన్నారు. పేర్ల మార్పిడి అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు రంజాన్, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు వినోద్, సుందర్, లక్ష్మణ్, బ్రహ్మం, నాగరాజు రెడ్డి, విఠోభ, మల్లికార్జున్, సతీష్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్: బాబు జగ్జీవన్‌రావు, బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో వివిధ దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను నేటి యువతరానికి తెలిజేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్‌రావు, 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాన్నారు. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున గ్రాంట్‌ను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎండీ హమీద్, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
దళిత నాయకులతో సమావేశం

మహనీయుల చరిత్రను చాటుదాం