
పాపన్న స్ఫూర్తితో అసమానతలపై పోరాడుదాం
కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్
చేర్యాల(సిద్దిపేట): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో నేటి యువత సమాజంలోని అసమానతలపై పోరాడాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్ సూచించారు. బుధవారం పాపన్న 315వ వర్ధంతిని పురష్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ సామాన్య కల్లు గీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న సమాజం బాగుండాలని కోరుకున్నారని, అందు కోసం కల్లుగీసే కత్తిని పక్కన పెట్టి ఖడ్గం చేతపట్టాడన్నారు. మొగలు సైన్యంపై తిరగబడి విజయం సాధించి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా గీత కార్మికులను పట్టించుకోవడం లేదని, రోజు రోజుకూ గీత వృత్తి అంతరించిపోతోందన్నారు. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ చెప్పిన విధంగా అన్ని రంగాల్లో సమానత్వం కోసం పాటుపడాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్వాయి పాపన్న, కంటమయ్య, రేణుక ఎల్లమ్మల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామని అందుకు గీత కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు నర్సింహులు, కనకయ్య, సిద్దిరాములు, బుచ్చిరాములు, గణేష్, రాములు, రాజు, సత్తయ్య, రాజయ్య, గోపాల్, ఐలయ్య, యాదగిరి, నరేష్, శ్రీనివాస్, చందు, వెంకటేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.