
మార్కెట్ల పంట పండింది
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి పెరగడంతో పలు మార్కెట్లకు ఆదాయం పెరిగింది. గతేడాది వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ జిల్లా పరిధిలోని 14 మార్కెట్లకు రూ.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ యేడాది మార్చి 31 నాటికి రూ.33.94కోట్లు ఫీజుల రూపంలో వసూలైంది. లక్ష్యానికి చేరువలోకి రావడమేకాక, గతేడాది కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.
వచ్చిన ఆదాయం వివరాలు.. (రూ.లలో)
మార్కెట్ 2024–25 2023–24
సిద్దిపేట 361.04 366.24
చిన్నకోడూరు 187.12 162.77
నంగనూరు 127.51 80.41
తొగుట 70.06 35.08
దౌల్తాబాద్ 150.05 86.89
కొండపాక 138.29 73.00
మిరుదొడ్డి 141.92 58.27
దుబ్బాక 195.70 195.43
బెజ్జంకి 269.61 267.54
హుస్నాబాద్ 456.57 403.47
కోహెడ 121.37 112.12
గజ్వేల్ 481.23 346.73
చేర్యాల 481.04 357.84
వంటిమామిడి 212.76 173.06
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లలో ఫీజుల రూపంలో అధికంగా డబ్బులు వసూలు చేసి గజ్వేల్ టాప్‌లో నిలువగా, తొగుట మార్కెట్ లాస్ట్‌లో నిలిచింది. నిర్దేశించిన లక్ష్యం కంటే చిన్నకోడూరు, నంగనూరు, మిరుదొడ్డి, బెజ్జంకి, గజ్వేల్, చేర్యాలలో అధికంగా ఆదాయం వచ్చింది. కోహెడ, సిద్దిపేట, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, దుబ్బాక, హుస్నాబాద్, ఒంటిమామిడి మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. పౌరసరఫరాల సంస్థ ద్వారా ధాన్యం, మార్కెఫెడ్ ద్వారా పొద్దుతిరుగుడు గింజలు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు మార్కెట్ ఫీజులతో ఆదాయం మార్కెట్‌లకు వస్తోంది.
పెరిగిన ఆదాయం
2023–24 సంవత్సరానికి రూ.27.18కోట్లు రాగా 2024–25కు రూ.33.94కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే రూ.6.76 కోట్ల ఆదాయం పెరిగింది. మార్కెట్ ఫీజులు, లైసెన్స్ రెన్యూవల్స్, వ్యవసాయ శాఖ చెక్ పోస్టుల ద్వారా మార్కెట్లకు ఆదాయం వస్తోంది. పలు చోట్ల రైతు బజార్, సమీకృత మార్కెట్, మటన్, చికెన్, ఫిష్ మార్కెట్‌లతో పాటు గదుల అద్దెల ద్వారా, పశువుల సంత ద్వారా ఆదాయం సమకురుతోంది. దీంతో కొన్ని మార్కెట్లకు ప్రతి యేడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా రూ.33.94 కోట్ల ఆదాయం
గజ్వేల్‌లో ఎక్కువ.. తొగుటలో తక్కువ
గతేడాది రూ.27.18 కోట్లే..
లక్ష్యం చేరుకోని పలు మార్కెట్లు
గతేడాది కంటే అధిక ఆదాయం
జిల్లాలో వ్యవసాయ శాఖ చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశాం. కార్యదర్శులందరూ సమష్టి కృషితో గతేడాది కంటే అధిక ఆదాయం వచ్చింది. నిర్దేశించిన టార్గెట్‌ను పలు మార్కెట్లు చేరుకోలేదు. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెడతాం. రైతులు పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నాం.
– నాగరాజు,
మార్కెటింగ్ అధికారి

మార్కెట్ల పంట పండింది