
‘వక్ఫ్’పై బీఆర్‌ఎస్ వైఖరి ప్రకటించాలి
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్‌ఎస్ వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్‌ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో తెలపాలన్నారు. దేశంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన 4 శాతం రిజర్వేషన్ ఇప్పటికీ అమలు అవుతోందని చెప్పారు. కేవలం ఎన్నికలప్పుడు ముస్లింల ఓట్లు దండుకునేందుకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ పదేళ్లపాటు కాలయాపన చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ ముస్లింలపై ప్రేమ కురిపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో బీఆర్‌ఎస్ సహకరిస్తోందని, ఆ రెండు పార్టీలు తోడుదొంగలేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజొద్దీన్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సలీం, ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.