
విద్యుదాఘాతంతో పంట దగ్ధం
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుదాఘాతంతో మొక్కజొన్న కంకులు బుగ్గిపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సయ్యద్ అనే రైతు పట్టా భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయింది. విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేశారు. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.80 వేల విలువ చేసే పంట కాలిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.
పిడుగుపాటుకుఇల్లు ధ్వంసం
ములుగు(గజ్వేల్): పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం బస్వాపూర్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కురుమ వసంత రామాంజనేయులు దంపతులు నివాసముంటున్న ఇంటిపై ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

విద్యుదాఘాతంతో పంట దగ్ధం