
కేతకీలో అమావాస్య పూజలు
తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. ఆదివారానికి తోడు అమావాస్య కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. వేకువ జాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు.
స్వామి వారికి ప్రత్యేక పూజలు
భక్తులు స్వామి వారికి అభిషేకం, అర్చన, హారతితోపాటు వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా పంచభక్ష పరమాన్నాలు మహా నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.