
చింతమడక.. స్ఫూర్తి మరవక
సిద్దిపేటరూరల్: స్వగ్రామమైన చింతమడక గ్రామస్తుల స్ఫూర్తితోనే జాగృతి పేరిట బతుకమ్మ పట్టుకొని రాష్ట్రమంతటా తిరిగానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఆమెను ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. చింతమడకలోని రామాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం మాదిగ సంఘం గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో బతుకమ్మ పేర్చారు. అనంతరం హైస్కూల్ గ్రౌండ్‌లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. ఆమె మాట్లాడుతూ చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామమన్నారు. అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు తనకు గుర్తుందన్నారు. చిన్నప్పుడు అన్ని కులాల వారిని కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినట్లు గుర్తు చేశారు. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే అదంతా చేయగలిగానన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అంతకుముందు రాఘవాపూర్‌లో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు.
బతుకమ్మతో రాష్ట్ర మంతటా తిరిగా..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఎంగిలిపూల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ