
అక్షరాలకు ఆది
● నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
● ముస్తాబైన వర్గల్ క్షేత్రం
వర్గల్(గజ్వేల్): తెలుగు రాష్ట్రాల్లో రెండో బాసరగా ఖ్యాతిగడించిన వర్గల్ విద్యా సరస్వతీ క్షేత్రం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. స్వయంభువుగా మహదేవుడు వెలసిన వర్గల్ శంభునికొండపై సప్తస్వరాల గుండు చెంత విద్యా సరస్వతి ఆలయం కొలువుదీరి దినదిన ప్రవర్థమానమై విరాజిల్లుతోంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి.
క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం
హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని వర్గల్ క్షేత్రానికి సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక ట్రిప్ చొప్పున బస్సు బయల్దేరుతుంది. ఇవే కాకుండా కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ వైపు వెళ్లే బస్సులో వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద దిగి ఆటోలో క్షేత్రానికి చేరుకోవచ్చు.
ఉత్సవాలకు నేడు అంకురార్పణ
సోమవారం ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. కలశస్థాపన, చతుషష్ట్యోపచార పూజలు, అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. 29న విశేష మూల సందర్భంగా ఉదయం గిరి ప్రదక్షిణ, 9 గంటలకు లక్ష పుష్పార్చన, 11 గంటలకు పుస్తక పూజ, అక్టోబర్1న మహర్నవమి, ఉదయం 9 గంటలకు అమ్మవారికి అష్టోత్తరశత కలశాభిషేకం, 2న కలశోద్వాసన, అభిషేకం, విద్యాసరస్వతి మాత విజయదర్శనం, శ్రవణా నక్షత్ర సందర్భంగా వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి అర్చన జరుగుతుంది.
అన్ని ఏర్పాట్లు చేశాం
అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందిలేకుండా బారికేడ్లతో క్యూలైన్లు, చిన్నారుల అక్షరస్వీకారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పీఠాధిపతులను, మంత్రులు తదితర ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తూ ఉత్సవ ఆహ్వానపత్రికలు అందజేశాం. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలి.
– యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్

అక్షరాలకు ఆది

అక్షరాలకు ఆది