దుబాయ్ : రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కాగా ఒక దశలో 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి 4 ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులే చేయగలిగింది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటింగ్‌లో ధవన్, అయ్యర్‌లు అర్థ సెంచరీలతో రాణించగా.. మిగతావారు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీయగా, ఉనాద్కట్ 2, త్యాగి, శ్రెయాస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుకే ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన రహానే ఆర్చర్ బంతులను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలనే రెండో ఓవర్ వేసిన ఆర్చర్ మూడో బంతికి రహానేను అవుట్ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తొలి స్పెల్‌లో జోఫ్రా ఆర్చర్ ప్రతీ బంతిని 140 కిమీ పైనే స్పీడుతో వేయడం విశేషం. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన ఆర్చర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రహానే అవుట్‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా మరో ఓపెనర్ ధవన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
కార్తిక్ త్యాగి వేసిన 6వ ఓవర్లో ధవన్ బౌండరీలతో విరుచుకుపడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు సాధించింది. ధవన్ 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్న కాసేపటికే శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు . ఆ తర్వాత అయ్యర్ కొన్ని మంచి షాట్లు ఆడి 43 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో అయ్యర్ స్కోరు పెంచే యత్నంలో త్యాగి బౌలింగ్‌లో 53 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయ్యర్ వెనుదిరిగాక రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఉనాద్కట్ వేసిన ఆఖరి ఓవర్లో ఒక బౌండరీ రావడంతో ఢిల్లీ జట్టు స్కోరు 161 పరుగులకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment