దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్సపై భారీ విజయం సాధించింది. 88 పరుగుల భారీ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వృద్దిమాన్ సాహా 87 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్ వార్నర్ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీకి వరుసగా ఇది హ్యాట్రిక్ ఓటమి. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ప్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ సాహా ప్రదర్శనపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన వృద్దిమాన్ సాహా నాకౌట్ ఇన్నింగ్స్‌తో విజయానికి దూరం కావాల్సి వచ్చిందంటూ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.
'ఈరోజు సాహా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిని ముందే తెలుసు.. కానీ ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం నుంచి జట్టుతో ఉంటున్న తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి తుఫాను ఇన్నింగ్స్ ఆడేశాడు. అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్‌స్టో రానున్న మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రావడం కష్టమే.. ఒకవేళ ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో.
ఎస్‌ఆర్‌హెచ్ విధించిన 220 పరుగులు చేధించడం కొంచెం కష్టమే. శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు ఓపెనర్లుగా వచ్చినా.. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ సున్నాకే వెనుదిరగడం.. మిగతావారు పూర్తిగా విఫలం కావడం.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. అయినా సాహా, వార్నర్ దాటికి పవర్‌ప్లేలో ఆ జట్టు ఈ లీగ్‌లోనే అత్యధికంగా 77 పరుగులు చేయడంతో విజయానికి అక్కడే దూరమయ్యామని అనిపించాం. ఆరంభం నుంచి ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సులువుగా ప్లేఆఫ్ చేరొచ్చనే విషయంపై స్పష్టంగానే ఉన్నాం.
ఒక దశలో ఏడు విజయాలు సాధించిన తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడంతో టాప్ ప్లేస్ కోసం మళ్లీ పోటీ ఏర్పడింది. ఇప్పుడు దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది. మాకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో కఠినమైన ముంబై, ఆర్‌సీబీని ఎదుర్కోనున్నాం. రెండు మ్యాచ్‌లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.. రెండు గెలిస్తే టాప్ ప్లేస్ మా సొంతం అవుతుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే.. రన్‌రేట్ కీలకమవుతుంది.. అందుకే రానున్న మ్యాచ్‌ల్లో రన్‌రేట్‌ను కూడా మరింత మెరుగుపరుచుకుంటాం.' అని పాంటింగ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment