తొలిసారి ఐపీఎల్ బరిలో యువతారలు
అందరి దృష్టి రచిన్ రవీంద్రపైనే
రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్‌లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
రాబోయే ఐపీఎల్ 17వ సీజన్‌లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం
గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై)
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం.
సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై)
ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది.
ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు.
యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్‌లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు.
వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై)
గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్‌లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు.
ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్)
2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది.
ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు.
లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్)
మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది.
లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో)
ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్‌ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment