టీ20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా రెండో టీ20లోనూ ఓటమిపాలైన ఆసీస్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. కాన్‌బెర్రా వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో (170) నిలిచిపోయింది. ఫలితంగా ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మలాన్, మొయిన్ మెరుపులు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 4.1 ఓవర్లలో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. వన్ డౌన్ బ్యాటర్ డేవిడ్ మలాన్ (48 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ మొయిన్ అలీ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. జోస్ బట్లర్ (13 బంతుల్లో 17) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా 2, కమిన్స్, స్టార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ పోరాటం వృధా..
179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోగా.. మిచెల్ మార్ష్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (23 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు వరుసగా ఔట్ కావడంతో, ఆఖర్లో వచ్చిన వేడ్ (10 బంతుల్లో 10), కమిన్స్ (11 బంతుల్లో 18) వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇంగ్లీష్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, డేవిడ్ విల్లే, రీస్ టాప్లే తలో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment