టీమిండియా డాషింగ్ ఆటగాడు, నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో స్కై ఆటకు ముగ్దుడైన అతను.. సూర్య బ్యాటింగ్ విన్యాసాలను వేనోళ్లతో పొగిడాడు. ముఖ్యంగా రెండో టీ20లో సూర్యప్రతాపాన్ని ఆకాశ్ ఆకాశానికెత్తాడు.
ఆ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు నమ్మశక్యంగా లేవని, అసలు అలాంటి షాట్లు ఆడటం భూమిపై ఎవరికైనా సాధ్యపడుతుందా అని నోరెళ్ల పెట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో అతను అలరించిన తీరు అత్యద్భుతమని, అతని బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాల లేదని ప్రశంసలతో ముంచెత్తాడు.
ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్లు మనిషి అనే వాడు ఆడలేడని, కొన్ని షాట్లు చూసాక అతను మనిషా లేక గ్రహాంతర వాసా అన్న డౌట్లు వచ్చాయని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఒకవేళ సూర్యకుమార్ గ్రహాంతర వాసే అయితే, అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో దేవుడికే తెలియాలని అన్నాడు.
ఇటీవలి కాలంలో అతని బ్యాటింగ్ శైలిలో చాలా మార్పు వచ్చిందని, ఇది టీమిండియాకు ఎంతో లాభదాయకమని తెలిపాడు. మౌంట్ మాంగనూయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన సూర్య.. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ట్యాగ్‌కు నిజమైన అర్హుడని అనిపించుకున్నాడని అన్నాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆడిన షాట్లు చూస్తే నమ్మశక్యంగా లేవని, టీ20ల్లో సూర్య టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లంతా అతనికి ఎదురుపడాలంటే జంకుతున్నారని, అంతలా అతను బౌలర్లను భయపెడతున్నాడన్నాడు. అయితే, అతను షాట్లు ఆడే రిస్కీ విధానం చూస్తే.. ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోవడం ఖాయమని, ఒకవేళ అలా జరిగినా అది ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment