ICC ODI World Cup 2023- India Vs Pakistan: టీమిండియా బ్యాటర్లపై పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అక్కసు వెళ్లగక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లు పాక్ బౌలర్లలా బౌలింగ్ చేయలేరని.. అందుకే భారత జట్టు వందల కొద్ది పరుగులు రాబట్టిందని పేర్కొన్నాడు. ఒకవేళ పాక్‌తో తలపడి ఉంటే భారీ స్కోర్లు నమోదయ్యేవి కావంటూ టీమిండియా ఆట తీరును తక్కువ చేసేలా మాట్లాడాడు.
అదరగొట్టిన టీమిండియా.. అదే హైలైట్
కాగా మూడు వన్డే, మూడు టీ20 సిరీస్‌లు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 18న హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ(208) హైలైట్‌గా నిలిచింది.
అదే విధగా రాయ్‌పూర్‌లో జనవరి 21న జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్‌ను 108 పరుగులకే కట్టడి చేసి 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.
క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటి
ఇక నామమాత్రపు ఇండోర్ వన్డేలో జనవరి 24 నాటి మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుబ్‌మన్ గిల్ (112) సెంచరీలతో చెలరేగడంతో ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. కివీస్ 295 పరుగులకే చేతులెత్తేయడంతో 90 రన్స్ తేడాతో గెలిచింది. తద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంది.
పాక్ గట్టి పోటీనిస్తుంది
ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ టీమిండియా- న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను ఉద్దేశించి జియో న్యూస్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టీమిండియా పాకిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ గట్టిపోటీనిస్తుంది.
మా ప్రధాన బలం అదే.. కివీస్‌లా కాదు
వరల్డ్‌కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లినా సరే.. అక్కడి పిచ్‌లు పాక్ ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు 400 మేర స్కోరు చేశారు. అయితే, పాకిస్తాన్ బౌలింగ్.. న్యూజిలాండ్ బౌలింగ్‌లా ఉండదు. నిజానికి వన్డేల్లో పాకిస్తాన్ క్రికెట్‌కు బౌలింగే ప్రధాన బలం. షాహిన్ ఆఫ్రిది, హారీస్ రవూఫ్, నసీం షా పూర్తి ఫిట్‌గా ఉన్నారు.
షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కూడా కీలకసమయంలో రాణించగలరు. కాబట్టి ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లలో పాకిస్తాన్ గనుక 300 స్కోరు చేసిందంటే దానిని ఛేధించడం ఏ జట్టుకైనా కష్టమే’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా 1992 ప్రపంచకప్ గెలిచిన జట్టులో జావేద్ సభ్యుడన్న విషయం తెలిసిందే.
ఏం జరుగుతుందో?!
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ వేదిక పాకిస్తాన్ కాగా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లదంటూ ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించాడు. దీంతో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ జట్టును భారత్‌కు పంపమంటూ పీసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు బోర్డులు తీసుకునే నిర్ణయంపైనే భారత్- పాక్ మ్యాచ్‌ల నిర్వహణ ఆధారపడి ఉంది.
చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!
IND vs AUS: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! ఇక కష్టమే
Comments
Please login to add a commentAdd a comment