Photo Credit: Twitter
విశాఖపట్నం వేదికగా జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ 2026కు సంబంధించి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్టును భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ నడిపించనున్నాడు. ఆర్నవ్ బుగ్గాకు డిప్యూటీ బాధ్యతలు అప్పగించింది. ఇక జట్టులో తన్మయ్ చౌదరీ, ఆర్యన్ శర్మ లాంటి రైజింగ్ స్టార్లకు జట్టులో చోటు కల్పించింది.
ఇక 18 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్ 2026)లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ టీమ్ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆర్యవీర్ 24 పరుగులు సాధించాడు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా అండర్ -19 జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆర్యవీర్ తన ప్రదర్శనతో అదరగొట్టాడు.
రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌తో కలిసి బ్యాటింగ్ పంచుకున్న ఆర్యవీర్ 109 పరుగులు సాధించాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో కూడా అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. మేఘాలయపై 309 బంతుల్లో 51 బౌండరీలతో సహా 297 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ క్రికెట్ తాజాగా వినూ మాన్కడ్ ట్రోఫీకి జూనియర్ సెహ్వాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. తనను తాను నిరూపించుకోవడానికి ఆర్యవీర్‌కు ఇదే మంచి అవకాశమని చెప్పొచ్చు.
ఢిల్లీ అండర్-19 జట్టు:
ఆర్యవీర్ సెహ్వాగ్ (కెప్టెన్), తన్మయ్ చౌదరి, అర్నవ్ బుగ్గా (వైస్ కెప్టెన్), ధన్య నక్రా, ఉదయ్ చావ్లా, గర్వ్ కుమార్, అభిరాజ్ గగన్ సింగ్ (వికెట్ కీపర్), తరుణ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్యన్ శర్మ, ఓజస్దీప్ సింగ్, కిరీట్ కౌశిక్, వరుణ్ వనజాని, రుద్రదేవ్ యాదవ్, ప్రద్యుమాన్ సనమ్, పార్థ్‌రాజ్, శంతను యాదవ్.
ఇదీ చదవండి: గేల్ ఒంటరి పోరాటం వృథా.. సఫారీల చేతిలో విండీస్ చిత్తు


