అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు.
గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్‌కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment