సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది. గత రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఏసీఏ ఈసారి కూడా ఆరు జట్లతో లీగ్‌ను కొనసాగించనుంది. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఈ జట్ల మధ్య కడప, విశాఖ ప్రాంతాలలో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జోన్ లెవల్ క్రీడాకారులకి గుర్తింపు తీసుకొని రావడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ జరగడం చాలా సంతోషకరం. మూలాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తేనే విజయవంతమవుతాం.
మూడో సీజన్ తర్వాత నాలుగో సీజన్ కూడా సజావుగా నిర్వహించాలని భావిస్తున్నాం. మంగళగిరిలో కూడా మ్యాచ్‌లు జరపాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నవనీత్ కృష్ణ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో పాల్గొంటున్నారు.
విశాఖ, కడప, మంగళగిరి లో వెయ్యి మందిని గుర్తించి స్క్రీనింగ్ చేశాం. ఇక సీజన్-1 స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బ్రాడ్ కాస్టింగ్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వలన సీజన్-2ను తెలుగులో ప్రసారం చేయలేకపోయాం. అయితే, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీసీసీఐ గైడ్‌లైన్స్‌తో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మెకానిక్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment