ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ
176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు.
నేపాల్‌ను మట్టికరిపించిన పాక్..
ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్‌లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment