శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సెమీ ఫైనల్(2) సందర్భంగా ముంబై తరఫున పునరాగమనం చేశాడు.
ఈ మేరకు తమిళనాడుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై కెప్టెన్ అజింక్య రహానే వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ రంజీ బరిలో దిగాడు.
ఆంధ్రతో మ్యాచ్ సందర్భంగా మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో భారత జట్టుతో చేరాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమైన అయ్యర్‌ను మూడో టెస్టు నుంచి పక్కనపెట్టారు సెలక్టర్లు.
ఈ క్రమంలో తనకు వెన్నునొప్పి తిరగబెట్టిందని శ్రేయస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. అదే సమయంలో టీమిండియాలో తిరిగి అడుగుపెట్టాలంటే తప్పక రంజీ బరిలో దిగాలని బీసీసీఐ ఆదేశించింది.
అయితే, అయ్యర్ ఫిట్‌నెస్ కారణాలు చూపి మినహాయింపు పొందాలని భావించగా.. ఎన్సీఏ మాత్రం అతడు ఫిట్‌గా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాల క్రమంలో 2022-24 ఏడాది గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులో అయ్యర్ పేరు గల్లంతైంది. దీంతో బీసీసీఐ ఆదేశాలు ధిక్కరించినందు వల్లే అయ్యర్‌పై వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై సారథి అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘తను అనుభవం ఉన్న ఆటగాడు.
ముంబై కోసం ఎప్పుడు బరిలోకి దిగినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. సెమీ ఫైనల్ సందర్భంగా అతడు జట్టుతో చేరడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ పేర్కొన్నాడు.
కాగా ముంబై వేదికగా శనివారం మొదలైన సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. ముంబైని బౌలింగ్‌కు ఆహ్వానించింది.
రంజీ సెమీఫైనల్-2.. ముంబై వర్సెస్ తమిళనాడు తుదిజట్లు
ముంబై
పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, భూపేన్ లల్వానీ, అజింక్య రహానె (కెప్టెన్), ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్ పాండే.
తమిళనాడు
ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ (కెప్టెన్), విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, ఎం.మహ్మద్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, కుల్దీప్ సేన్.
Comments
Please login to add a commentAdd a comment