ఐపీఎల్-2023లో ఆర్సీబీ స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గణాంకాలు పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఈ ఇద్దరు 8 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఒకే గణాంకాలు కలిగి ఉన్నారు. కోహ్లి 8 మ్యాచ్‌ల్లో 234 బంతులను ఎదుర్కొని 334 పరుగులు చేస్తే.. గిల్ కూడా అన్నే బంతులను ఎదుర్కొని కోహ్లి చేసినంత స్కోరే చేశాడు.
యాదృచ్చికంగా నమోదైన ఈ గణాంకాలను చూసి గిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లిలానే గిల్ కూడా కెరీర్‌లో సూపర్ సక్సెస్ అవుతాడని సంబురపడిపోతున్నారు. దీనికి సంబంధించి కామెంట్స్ సోషల్‌మీడియలో పోస్ట్ చేస్తూ గిల్‌ను కోహ్లితో పోలుస్తున్నారు.
కాగా, ఇటీవల కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్న గిల్‌ను విశ్లేషకులు సైతం కోహ్లితో పోలుస్తున్న విషయం తెలిసిందే. వారి అంచనాలకు తగ్గట్టుగానే గిల్ కూడా చెలరేగి ఆడుతున్నారు. కోహ్లి కెరీర్ ఆరంభంలో ఎంత దూకుడుగా ఆడే వాడో.. గిల్ అంతకుమంచి దూకుడు ప్రదర్శిస్తూ విజృంభిస్తున్నాడు. తన మార్కు ఆటతీరుతో ఇదివరకే టీమిండియాలో స్థానం పక్కా చేసుకున్న గిల్.. ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తపడితే కోహ్లిని మించిపోతాడని భారత క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
ఇక ఐపీఎల్-2023 విషయానికొస్తే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరి గణంకాలు ఒకేలా ఉన్నప్పటికీ గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లు తన జట్టుకు అక్కరకు వస్తే.. కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం ఆర్సీబీని గెలిపించలేకపోయాయి. గుజరాత్‌లో గిల్‌తో పాటు ప్రతి ఒక్కరు తలో చేయి వేస్తూ జట్టు విజయాల్లో సమానపాత్ర పోషిస్తుంటే, ఆర్సీబీ మాత్రం KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)లపైనే పూర్తిగా ఆధారపడి ఉంది.
వీరు ముగ్గురు తలో చేయి వేస్తేనే ఆర్సీబీ ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు గెలవగలిగింది. వీరికి బౌలింగ్‌లో సిరాజ్ మెరుపులు తోడందించాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉండగా.. గుజరాత్ మాత్రం 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లి, గిల్ గణాంకాలు..
కోహ్లి: 8 మ్యాచ్‌ల్లో 234 బంతుల్లో 47.57 సగటున 5 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఇందులో 31 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. కోహ్లి ఓ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు.
గిల్: 8 మ్యాచ్‌ల్లో 234 బంతుల్లో 41.62 సగటున 3 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఇందులో 40 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment