కమిన్స్, రసెల్, దినేశ్ కార్తీక్, గిల్ (ఫైల్)
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఘనమైన ఆరంభమిచ్చిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్). బ్రెండన్ మెకల్లమ్ కళ్లు చెదిరే సెంచరీ ఇన్నింగ్స్‌తోనే ఐపీఎల్ మెరుపుల లీగ్‌గా మారిపోయింది. ఇన్నేళ్లలో రెండుసార్లు టైటిల్ కూడా సాధించిన కేకేఆర్ ఈ సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. 2019లో ఇంగ్లండ్‌ను వన్డే వరల్డ్ చాంపియన్‌గా చేసిన మోర్గాన్ ఇప్పుడు కేకేఆర్‌ను మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలుపుతాడనే అంచనాలతో ‘సై’ అంటోంది.
–సాక్షి క్రీడావిభాగం
‘బాలీవుడ్ బాద్‌షా’ షారుఖ్ ఖాన్ జట్టు కేకేఆర్ 2014లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అనంతరం 2015లో లీగ్ దశలో ఇంటిదారి పట్టాక వరుసగా మూడేళ్లు (2016, 2017, 2018) ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినా ఫైనల్‌కు చేరలేకపోయింది. గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ గత రెండు సీజన్‌లలో మాత్రం తడబడింది. లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే ఈసారి టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో సమతూకం పాటిస్తూ కుర్రాళ్లపై కూడా నమ్మకం పెట్టుకుంది. వేలంలో దేశవాళీ ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనంలో జట్టును మరో దశకు చేర్చేందుకు మోర్గాన్ సేన సన్నద్ధమవుతుంది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్ గిల్ మరింత రాటుదేలాడు. అంతర్జాతీయ సిరీస్‌లలో అసాధారణ ప్రదర్శన కనబరచడం జట్టుకు లాభించే అంశం. మిడిలార్డర్‌లో మోర్గాన్, రసెల్, షకీబ్ మెరిపిస్తే నరైన్ తన స్పిన్ మాయాజాలాన్ని పునరావృతం చేస్తే ‘మూడో’ టైటిల్ ముచ్చట తీరుతుంది.
కొత్తగా వచ్చినవారు...
వేలానికి ముందు కోల్‌కతాకు నరైన్, రసెల్‌ల కోసం ప్రత్యామ్నాయ ఆటగాళ్ల అవసరం కనిపించింది. అయితే భారీ మొత్తం అందుబాటులో లేకపోవడంతో మ్యాక్స్‌వెల్, గౌతమ్, క్రిస్టియాన్‌ల కోసం పోటీ పడి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే షకీబ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ జట్టుకు దక్కడం సానుకూలాంశం. రసెల్ ఫిట్‌నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే బెన్ కటింగ్ కొంత ఉపయోగపడగలడు. ఇక చివర్లో వేలం ముగిసే సమయంలో హర్భజన్ సింగ్‌ను తీసుకున్నా 2019 ఐపీఎల్ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది సందేహమే. వేలంలో కరుణ్ నాయర్, పవన్ నేగిలను ఎంచుకున్న టీమ్... ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లు షెల్డన్ జాక్సన్, వెంకటేశ్ అయ్యర్, వైభవ్ అరోరాలను వారి కనీస విలువ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.
తుది జట్టు అంచనా/ఫామ్
గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. నరైన్, రసెల్‌లలో పదును తగ్గినట్లు రెండు సీజన్లుగా కనిపిస్తూనే ఉంది. తుది జట్టులో కచ్చితంగా ఉండే విదేశీ ఆటగాళ్లు కెప్టెన్ మోర్గాన్, కమిన్స్. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 12 వికెట్లే తీసిన ఆసీస్ పేసర్ ఈ సారైనా ప్రభావం చూపించగలడా అనేది ఆసక్తికరం. మోర్గాన్ తన స్థాయి మేరకు బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనం ఉంటుంది. భారత జట్టుకు ఆడి రెండేళ్లయిన దినేశ్ కార్తీక్ గత ఐపీఎల్‌లో 14.08 సగటుతో 169 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రెగ్యులర్ సభ్యుడే అయినా అతని స్ట్రయిక్‌రేట్ పేలవం. ‘వన్ సీజన్ వండర్’లాంటి నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠిలనే నమ్ముకుంటే కష్టం. బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ ఒక్కడే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. యువ పేసర్లు శుభమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటి ఏమాత్రం రాణిస్తారో చూడాలి. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం కాగా... ఇటీవలి ప్రదర్శనను బట్టి చూస్తే కుల్దీప్ యాదవ్ ఇక ఏమాత్రం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసరగలడనేది సందేహమే. ఓవరాల్‌గా చూస్తే తొలి బంతి నుంచే విరుచుకుపడి ప్రత్యర్థికి దడ పుట్టించే లైనప్ లా మాత్రం కేకేఆర్ కనబడటం లేదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరగలిగితే గొప్ప.
జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, గుర్‌కీరత్ మన్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటి, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కరుణ్ నాయర్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, హర్భజన్ సింగ్.
విదేశీ ఆటగాళ్లు: మోర్గాన్ (కెప్టెన్), రసెల్, కమిన్స్, షకీబ్, నరైన్, ఫెర్గూసన్, బెన్ కటింగ్, టిమ్ సీఫెర్ట్.
అత్యుత్తమ ప్రదర్శన రెండుసార్లు చాంపియన్ (2012, 2014)
2020లో ప్రదర్శన: యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్ టోర్నీలో దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ అభిమానుల్ని నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 7 పరాజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. అసలు ఏ దశలోనూ టీమ్‌నుంచి అబ్బురపరచే ప్రదర్శన ఒక్కటీ రాలేదు. సిరాజ్ దెబ్బకు 84 పరుగులకే పరిమితమైనప్పుడే జట్టు ఆటపై సందేహాలు కనిపించాయి. ఆశలు పెట్టుకున్న నరైన్, రసెల్ అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయారు. తొలి 7 మ్యాచ్‌ల తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... అప్పటికే ఆలస్యం కావడంతో జట్టును ముందుకు నడిపించడం మోర్గాన్ వల్ల కూడా కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment