రహానే- గిల్ విజయానందం
మెల్‌బోర్న్: తాము అవలంబించిన ఐదు బౌలర్ల వ్యూహం బాగా పనిచేసిందని టీమిండియా కెప్టెన్(తాత్కాలిక) అజింక్య రహానే హర్షం వ్యక్తం చేశాడు. అడిలైడ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఒత్తిడిని జయించి ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారని పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడారంటూ రహానే ప్రశంసలు కురిపించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానే సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది పింక్‌బాల్ టెస్టులో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనప్పటికీ సమిష్టి కృషితో ఆసీస్‌ను మట్టికరిపించింది.(చదవండి: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం)
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. ‘‘ మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అందరూ బాగా ఆడారు. అయితే ఈ విక్టరీ క్రెడిట్ అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్, గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. అడిలైడ్ మ్యాచ్ తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లిద్దరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు అమోఘం. అలాంటి వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఇక మేం అనుసరించిన ఐదు బౌలర్ల వ్యూహం ఈ మ్యాచ్‌లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒక ఆల్‌రౌండర్ కావాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే జడేజా అద్భుతంగా రాణించాడు. ఇక శుభ్‌మన్ గురించి చెప్పాలంటే తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ గురించి మనకు తెలుసు. ఈ మ్యాచ్‌లో కూడా తను అదే స్థాయిలో ఆడాడు. సిరాజ్ ఎంతో క్రమశిక్షణగా బౌల్ చేశాడు. దేశవాలీ క్రికెట్‌లో వారికున్న అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. మైదానంలో వారు ప్రదర్శించిన ఆటతీరు గొప్పగా ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. గిల్ మొత్తంగా 80(45+35) పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment