టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. హార్దిక్ మెరుగైన నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్ అని.. అయితే, అతడి ఫిట్‌నెస్ విషయంలో మాత్రం క్లారిటీ లేదన్నాడు.
అలాంటి ఆటగాడిని జట్టుకు ఎంపిక చేసేటపుడే కోచ్, సెలక్టర్ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందన్న అగార్కర్.. మరి ఏకంగా కెప్టెన్‌గా ఎలా నియమించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా జట్టులో అతడు కీలక ఆటగాడని.. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నాడు.
పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.
పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్.. భారత్ ఈ ఐసీసీ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. టీ20 వరల్డ్‌కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకం ఖరారు అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది బీసీసీఐ.
శ్రీలంక పర్యటన నుంచి సూర్య పగ్గాలు చేపడతాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి ముంబైలో సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన అగార్కర్.. ‘‘అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండి.. అన్నింటిలోనూ చురుగ్గా ఆడగల కెప్టెన్ కావాలని మేము కోరుకుంటున్నాం.
అలాంటి కెప్టెన్ మాత్రమే మాకు కావాలి
హార్దిక్ విషయంలో ఈ అంశంపై స్పష్టత లేదు. అతడి విషయంలో ఫిట్‌నెస్ అతి పెద్ద సవాలు. అదే కోచ్, సెలక్టర్లను ఇబ్బంది పెడుతోంది. తదుపరి టీ20 ప్రపంచకప్ దాకా మాకు సమయం ఉంది.
హార్దిక్ విషయంలో ఫిట్‌నెస్ ఒక్కటే ప్రామాణికం. జట్టుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కెప్టెన్ మాత్రమే మాకు కావాలి. ఇక సూర్య.. కెప్టెన్ కావడానికి గల అన్ని అర్హతలు, నైపుణ్యాలు అతడికి ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు.
టీమిండియా టీ20 కెప్టెన్‌గా రాణించగల సత్తా సూర్యకు ఉందని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అదే విధంగా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అవసరం జట్టుకు ఎంతగానో ఉందని తెలిపాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ ఆరంభం కానుంది.
చదవండి: రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment