All England Badminton 2022: Gayatri Gopichand & Trisha Jolly reach semifinals in women's doubles - Sakshi
Sakshi News home page

గాయత్రి–త్రిషా జంట సంచలనం

Published Sat, Mar 19 2022 4:37 AM | Last Updated on Sat, Mar 19 2022 9:41 AM

All England Badminton: Gayatri Gopichand and Trisha Jolly reach semifinals in womens doubles - Sakshi

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్‌ టీనేజ్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ షిప్‌లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది.

బర్మింగ్‌హమ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్‌ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్‌ ద్వయం లీ సోహీ–షిన్‌ సెయుంగ్‌చాన్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్‌ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ షిప్‌లో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది.  

గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్‌ సెయుంగ్‌చాన్‌ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్‌ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్‌ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు.

రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్‌ జోడీ జెంగ్‌ యు–షు జియాన్‌ జాంగ్‌ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది.

సెమీస్‌లో లక్ష్య సేన్‌...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్‌ లూ గ్వాంగ్‌ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్‌ లభించింది. ప్రకాశ్‌ పదుకొనె, పుల్లెల గోపీచంద్‌ తర్వాత ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్‌ గుర్తింపు పొందాడు.

డిఫెండింగ్‌ చాంప్‌ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) మధ్య మ్యాచ్‌ విజేతతో  నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ ఆడతాడు.  పురుషుల డబుల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ మార్కస్‌ గిడియోన్‌ –కెవిన్‌ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్‌ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది.

నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్‌ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్‌ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం.
–గాయత్రి

తల్లిదండ్రులకు తగ్గ తనయ
గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్‌ 2001లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement