
ఐపీఎల్-2025లో అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌కు జాక్ పాట్ తగిలింది. ఈ మిస్టర్ స్పిన్నర్‌ను ఏకంగా రూ. 4.8 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఘజన్‌ఫర్ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేసింది. తర్వాత పోటీలోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఆఖరికి ఆర్సీబీ, కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ అఫ్గానీ ముంబై సొంతమయ్యాడు.
అప్పుడేమో రూ. 20 లక్షలు..
కాగా ఐపీఎల్-2024లో ఘజన్‌ఫర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ గాయం కారణంగా సీజన్ మధ్యలో తప్పుకోవడంతో కేకేఆర్ ఘజన్‌ఫర్‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 20లక్షల కనీస ధరకు అతడితో కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకుంది.
కానీ ఘజన్‌ఫర్‌కు కేకేఆర్ తరపున ఆడే అవకాశం మాత్రం రాలేదు. కాగా గత సీజన్‌లో కేవలం రూ. 20లక్షలు మాత్రమే తీసుకున్న ఘజన్ ఫర్ దశ ఐపీఎల్-2025 వేలంతో మారిపోయింది. గతంలో అతడు తీసుకున్న మొత్తంతో పోలిస్తే ఈసారి తనకు దక్కనున్నది రూ. 4.6 కోట్లు అదనం కావడం గమనార్హం.
వైట్‌బాల్ క్రికెట్‌లో అదుర్స్..
కాగా ఘజన్‌ఫర్ ఈ ఏడాది ఆరంభంలో వన్డే ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఘజన్‌ఫర్ సంచలన ప్రదర్శన చేఆడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అదే విధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో కూడా ఘజన్‌ఫర్ అదరగొట్టాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. మొత్తంగా 16 టీ20లు ఆడిన ఘజన్‌ఫర్.. 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు.