
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టయిరిస్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో మూడో స్థానంలో బరిలో దిగేందుకు రాయుడే సరైనవాడని అతను పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్ మాజీ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. ‘రైనా లాంటి క్లాస్ క్రికెటర్‌ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకునే ప్లేయర్‌ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్‌ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. మూడో స్థానంలో రాయుడు సరైన ఎంపిక. రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. దీనితో పాటు టాపార్డర్‌లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే’ అని స్టయిరిస్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment