కివీస్‌ కెప్టెన్‌ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా | Amelia Kerr Century Helps NZ-W Won By 92 Runs Vs SA-W 5th T20I | Sakshi
Sakshi News home page

కివీస్‌ కెప్టెన్‌ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా

Mar 25 2026 11:32 AM | Updated on Mar 25 2026 11:42 AM

Amelia Kerr Century Helps NZ-W Won By 92 Runs Vs SA-W 5th T20I

సొంత‌గ‌డ్డ‌పై సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు దుమ్మురేపింది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న కివీస్ మ‌హిళ‌లు తాజాగా చివ‌రి టీ20లోనూ విజ‌యం సాధించి 4-1తో సిరీస్ చేజేక్కించుకొని స్ప‌ష్ట‌మైన ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. క్రైస్ట్‌చ‌ర్చి వేదికగా బుధ‌వారం జ‌రిగిన ఐదో టీ20లో సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు చిత్తుగా ఓడిపోయింది.  

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (55 బంతుల్లో 105; 19 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి సెంచ‌రీతో  ఆక‌ట్టుకోగా.. బ్రూక్ హాలిడే (26), జార్జియా పిల్మ‌ర్ (27) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.  స‌ఫారీ బౌల‌ర్ల‌లో కాకా, తుమి సెకుహునేలు చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 195 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా వుమెన్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 102 ప‌రుగులు మాత్రమే చేసింది. అన్నిరే డెర్క్‌సెన్ (23) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా మిగతా బ్యాట‌ర్లు ప‌రుగులు సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. నూజిలాండ్ బౌలర్ల‌లో లియా తాహుహు 3 వికెట్లు తీయ‌గా, సోఫీ డివైన్‌, అమేలియా కెర్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన అమేలియా కెర్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకుంది.  ఇరుజ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే ఆదివారం జ‌ర‌గ‌నుంది.

రికార్డుల‌కు పాత‌ర‌..
ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ ద్వారా అమేలియా కెర్ ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఐదో టీ20లో సెంచ‌రీ చేయ‌డం ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి టీ20 సెంచ‌రీ మార్క్‌ను అందుకుంది. అంతేకాదు టీ20 క్రికెట్‌లో వ‌రుసగా 11సార్లు 30 ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేసిన తొలి బ్యాట‌ర్‌గా అమేలియా కెర్ చ‌రిత్ర‌కెక్కింది. 

స‌ఫారీల‌తో జ‌రిగిన నాలుగో టీ20లోనే ఈ రికార్డు అందుకున్న‌ప్ప‌టికీ తాజాగా సెంచ‌రీతో త‌న రికార్డును మ‌రింత మెరుగుప‌రుచుకుంది.  అమేలియా కెర్ కంటే ముందు చ‌మేరీ ఆట‌ప‌ట్టు, రెబెక్కా బ్లేక్‌లు చెరో 9సార్లు 30 ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేశారు. పురుషుల క్రికెట్‌లో భార‌త క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, అభిషేక్ శ‌ర్మ‌లు చెరో ఏడుసార్లు 30 ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేశారు. 

గ‌త 11 ఇన్నింగ్స్‌ల్లో 669 ప‌రుగులు చేసిన అమేలియా బౌలింగ్‌లోనూ 12 వికెట్లు ప‌డ‌గొట్టింది.  ఇటీవ‌లే మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు, వంద వికెట్లు తీసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా అమేలియా కెర్ నిలిచింది.

చదవండి: క్రికెటర్‌ నుంచి చైర్మన్‌ దాకా.. ఎవరీ ఆర్యమాన్‌ బిర్లా?

Advertisement
 
Advertisement
Advertisement