కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్‌లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు.
వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు.
అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు.
ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment