ck naidu trophy
-
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..
కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు. అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు. ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
బీసీసీఐ సంచలన నిర్ణయం..
ముంబై: కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో ఈ నెల 13న ప్రారంభానికి సిద్ధమైన రంజీ ట్రోఫీ సహా, సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టి20 లీగ్ టోర్న మెంట్లను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లు, సిబ్బంది, టోర్నీ అధికారుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యమని, ఈ నేపథ్యంలోనే టోర్నీలు ముందనుకున్న షెడ్యూలు ప్రకారం జరిగే అవకాశం లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది కేసుల తీవ్రత, అనుకూల పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది. -
జైస్వాల్ ఉతికి ఆరేశాడు..!
ముంబై: లిస్ట్-ఎ క్రికెట్లో పిన్నవయసులో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా పాండేచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో జైస్వాల్ భారీ సెంచరీ సాధించాడు. ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న యశస్వి.. ఆ తర్వాత తొలి మ్యాచ్ ఆడుతూనే బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాండిచ్చేరి 209 పరుగులకు ఆలౌటైన తర్వాత.. ముంబై మొదటి ఇన్నింగ్స్‌ను జైస్వాల్-అమామ్ హకీమ్ ఖాన్లు ఆరంభించారు. హకీమ్(64) తొలి వికెట్‌గా ఔట్ కాగా, యశస్వి మాత్రం నిలకడగా ఆడాడు. 243 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 185 పరుగులు సాధించాడు. హకీమ్‌తో కలిసి తొలి వికెట్‌కు 98 పరుగులు నమోదు చేసిన జైస్వాల్.. రెండో వికెట్‌కు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి 31 పరుగులు జత చేశాడు. మూడో వికెట్‌కు హార్దిక్ జితేంద్ర తామోర్(86)తో కలిసి 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీ సాధించిన యశస్వి.. డబుల్ సెంచరీని 15 పరుగుల వ్యవధిలో ఔటయ్యాడు. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్‌లో యశస్వి 400 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకునే క్రమంలో యశస్వి ఒక అజేయం సెంచరీతో పాటు నాలుగు అర్థ శతకాలు నమోదు చేశాడు. -
41 ఫోర్లు, 2 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో మహారాష్ట్ర జట్టు దీటుగా రాణించింది. బ్యాట్స్‌మన్ స్వప్నిల్ ఫుల్పగర్ (474 బంతుల్లో 328; 41 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ట్రిపుల్ సెంచరీతో విజంభించడంతో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 294/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మహారాష్ట్ర జట్టు ఆట ముగిసే సమయానికి 172 ఓవర్లలో 7 వికెట్లకు 656 పరుగులతో నిలిచింది. దీంతో ఆతిథ్య జట్టుకు 3 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. స్వప్నిల్ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కగా.. యశ్ క్షీర్సాగర్ (288 బంతుల్లో 142; 18 ఫోర్లు) సెంచ రీతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 326 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్ఆర్ నికమ్ (42; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎస్డీ వార్ఘంతే (60; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి 653 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ హైదరాబాద్ బౌలర్లు ప్రభావం చూపించలేకపోవడంతో ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి కేవలం ఒకే పాయింట్‌కు పరిమితమైంది. మహారాష్ట్రకు 3 పాయింట్లు దక్కాయి. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈనెల 13 నుంచి సూరత్ వేదికగా జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్, అంజుమ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును వచ్చే నెల 12వ తేదీన ముంబైలో జరిగే బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇవ్వనుంది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీకాంత్... భారత్‌కు 1981–1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేసిన ఈ 60 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్... భారత్ 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడు. అంతేకాకుండా అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకోవడం విశేషం. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్ చోప్రా తన కెరీర్లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది. -
ఇదేమి బౌలింగ్ బ్రో..?
కళ్యాణి(పశ్చిమబెంగాల్): దక్షిణాఫ్రికా మాజీ స్సిన్నర్ పాల్ ఆడమ్స్ బౌలింగ్ క్రికెట్‌తో పరిచయం ఉన్న వారికి దాదాపు సుపరిచితమే. అతను స్టార్ స్పిన్నర్ కాకపోయినా, బౌలింగ్ వేసేటప్పుడు తన తలను పూర్తిగా వంచి చిత్రమైన యాక్షన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆడమ్స్. ఆ తరహా బౌలింగ్‌ను ఇప్పటివరకూ మనం చూడకపోయినా, అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎంతోమంది బౌలర్ల వింత యాక్షన్‌ను మనం చూస్తునే ఉన్నాం. బౌలర్ల వింత యాక్షన్‌ను కొన్నిసార్లు అంఫైర్లు తప్పుబట్టగా... మరికొన్ని సార్లు ఐసీసీ సైతం కలగజేసుకుని బౌలింగ్ తీరుని మార్చుకోవాల్సిందిగా సూచించిన సందర్బాలు అనేకం. ఇలా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనేక సార్లు అంఫైర్ల వార్నింగ్‌లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా, అండర్-23 సీకే నాయుడు టోర్నీలో భాగంగా ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో 360 డిగ్రీలు తిరిగి బంతి వేశాడు యూపీ స్పిన్నర్ శివ సింగ్. వివరాల్లోకి వెళితే ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టామ్ స్పిన్నర్ శివ సింగ్ కాస్త వింతగా బౌలింగ్ చేశాడు. అతడు 360 డిగ్రీలు తిరిగి మరీ బంతిని విసిరాడు. దాంతో అంపైర్ వినోద్ శేషన్ దానిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు. దీనిపై బౌలర్ నిరసన వ్యక్తం చేయగా ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐసీసీ రూల్స్‌లో ఇలాంటి చర్యలకు ఏం చేయాలన్న దానిపై ప్రత్యేకంగా ఓ చట్టం అంటూ లేకపోవడంతో అంఫైర్ తీసుకున్న నిర్ణయం సరైందా? లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే చట్టంలో 41.2 ప్రకారం ఓ ప్లేయర్ చర్య సరిగా ఉందా? లేదా తేల్చే హక్కు మాత్రం అంపైర్‌కు మాత్రమే ఉంది. బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బ తీయడానికి కావాలని బౌలర్ ఇలా చేశాడని అంపైర్ భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతను స్వతహాగా ఇదే యాక్షన్‌తో బౌలింగ్ చేసిన సందర్బాలు లేవు. బ్యాట్స్‌మన్‌కు గందరగోళంలో పడేయడానికే ఇలా చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అన్ని బంతులు అలాగే వేయడానికి సిద్ధమైతే మాత్రం ఆ యాక్షన్‌తో బౌలింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చని దేశవాళీ అంపైర్ ఒకరు తెలిపారు. Weirdo...!! Have a close look..!! pic.twitter.com/jK6ChzyH2T — Bishan Bedi (@BishanBedi) 7 November 2018 -
సీకే నాయుడు ట్రోఫీ విజేత ఢిల్లీ
ముంబై: దేశవాళీ అండర్–23 టోర్నీ సీకే నాయుడు ట్రోఫీని ఢిల్లీ జట్టు గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ముంబైపై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి విజేతగా నిలిచింది. వికెట్ కీపర్ రావత్ (75) అర్ధ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. -
హైదరాబాద్ తడబాటు
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-23 (ఎలైట్ గ్రూప్ ‘సి’) టోర్నీలో మహారాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ లో 28 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు 23, చైతన్య రెడ్డి 22 పరుగులు చేశారు. అంతకుముందు 192/3 స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్సలో 128.4 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. దీంతో మహారాష్ట్ర 108 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యాన్ని సంపాదించింది. వై.జె. షేక్ (113) సెంచరీతో, ఎస్. ఎం. ఖాజి (67) అర్ధసెంచరీలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3, తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్సలో 304 పరుగులు చేసింది. -
హైదరాబాద్ 258 ఆలౌట్
ముంబై: సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా ముంబై జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్సలో 258 పరుగులకు ఆలౌటైంది. చైతన్య కృష్ణ (42), మల్లికార్జున్ (43), రోహిత్ రెడ్డి (46) ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో ములానీ, ఆదిత్య తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ముంబై జట్టు బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఆకర్షిత్ గోమెల్ (35), ఏక్నాథ్ కేర్కర్ (33 బ్యాటింగ్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సయ్యద్ 3, తనయ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం ముంబై జట్టు 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముంబై తొలి ఇన్నింగ్సలో 121.5 ఓవర్లలో 409 పరుగులకు ఆలౌటైంది.