అన్షు మలిక్, సరిత మోర్
ఓస్లో (నార్వే): టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశ పరిచినా... ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అన్షు మలిక్ అదరగొట్టింది. గతంలో ఏ భారతీయ మహిళా రెజ్లర్‌కు సాధ్యంకాని ఘనతను 20 ఏళ్ల అన్షు సాధించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు రికార్డు నెలకొల్పింది. 57 కేజీల విభాగంలో అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 3 నిమిషాల 53 సెకన్లలో అన్షు విజయం ఖాయమైంది. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతి అంటే ప్రత్యర్థిపై కనీసం 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే బౌట్‌ను ముగించి ఈ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో అన్షు 5–1తో దావాచిమెగ్ ఎర్కెమ్‌బాయర్ (మంగోలియా)పై, తొలి రౌండ్‌లో 4 నిమిషాల 5 సెకన్లలో 15–5 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో నీలూఫర్ రైమోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూయిస్ మరూలిస్ (అమెరికా)తో అన్షు తలపడుతుంది.
ప్రపంచ చాంపియన్‌ను ఓడించి...
మరోవైపు 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సరితా మోర్ 0–3 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ నిలిచిన బిల్యానా జికోవా డుడోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో సరితా 8–4తో ప్రపంచ చాంపియన్ లిండా మొరైస్ (కెనడా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సరితా 3–1తో సాండ్రా (జర్మనీ)పై గెలిచింది. ఇనెటా (లిథువేనియా), సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో నేడు జరిగే కాంస్య పతక పోరులో సరితా మోర్ తలపడుతుంది.
72 కేజీల విభాగంలో దివ్యా కక్రాన్ కాంస్య పతకం రేసులో నిలిచింది. దివ్య క్వార్టర్ ఫైనల్లో 0–10తో మసాకో ఫురూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అయితే మసాకో ఫైనల్ చేరడంతో దివ్యా ‘రెపిచాజ్’ రౌండ్‌లో నేడు దావానసన్ (మంగోలియా)తో ఆడుతుంది. ఈ బౌట్‌లో దివ్య గెలిస్తే కాంస్య పతకం కోసం అనా కార్మెన్ షెల్ (జర్మనీ)తో పోటీపడుతుంది.
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మలిక్. గతంలో అల్కా తోమర్ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
కిరణ్‌కు నిరాశ
మహిళల 76 కేజీల విభాగంలో భారత్‌కు త్రుటిలో కాంస్య పతకం చేజారింది. కాంస్య పతక బౌట్‌లో భారత రెజ్లర్ కిరణ్ 1–2తో సమర్ హంజా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్‌కు నాలుగోసారి కాంస్య పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్‌లో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు), మహిళల విభాగంలో పింకీ (55 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్‌లలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment