మరో ప్రపంచానికి మారడోనా | Argentina Football Legend Diego Maradona Died At The Age 60 | Sakshi
Sakshi News home page

మరో ప్రపంచానికి మారడోనా

Published Wed, Nov 25 2020 11:03 PM | Last Updated on Thu, Nov 26 2020 4:05 PM

Argentina Football Legend Diego Maradona Died At The Age 60 - Sakshi

1986 ప్రపంచకప్‌ గెలిచిన క్షణం

దేవుడే నా చేతితో గోల్‌ చేయించాడు అని మారడోనా చెబితే ప్రపంచమంతా నమ్మిందే తప్ప అనుమానించలేదు. 17 ఏళ్ల పాటు కోట్లాది అభిమానులకు ఫుట్‌బాల్‌ అంటే డీగోనే... మరో పేరు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా అతను ఫుట్‌బాల్‌ను పరుగెత్తించాడు. అతను ఆడిందే ఆట... ఆడకపోయినా వార్త... ‘గోల్‌ ఆఫ్‌ ద సెంచరీ’ చేసినా అతనే... గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ అతనే... మారడోనా గొప్పతనం చెప్పేందుకు మాటలు అవసరం లేదు... అలా నడుస్తూ, పరుగెత్తుతూ కూడా అలవాటుగా కాలును గాల్లో ఆడించే అందరిలో మారడోనానే కనిపిస్తాడు. ఆటకు, ఆటను పిచ్చిగా ప్రేమించేవారికి అతను ఇచ్చిన ‘కిక్‌’ అలాంటిది. ‘10’ నంబర్‌ పాదముద్ర ఎప్పటికీ చెరిగిపోలేనిది.  

ఆటలో అద్భుతాలు చేసేందుకు మారడోనాకు 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు అడ్డు రాలేదు... అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌గా అతని చురుకుదనం, కదలికలు ప్రపంచాన్ని అబ్బుర పరిచాయి. బలమైన కాళ్లు, నమ్మశక్యం కాని వేగం, కనుమూసి తెరిచేలోపు ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ దూసుకుపోయే నైపుణ్యం... దశాబ్దాల ఫుట్‌బాల్‌ చరిత్రలో మరెవరికీ సాధ్యంకాని చిరస్మరణీయ క్షణాలను అందించాయి. రైట్‌ వింగర్‌గా గోల్‌ లైన్‌ వైపు దూసుకుపోయే దూకుడు... అబ్బురపరిచే రివర్స్‌ క్రాస్‌ పాస్‌ ‘రొబోనా’ను మారడోనా అంత చూడముచ్చటగా ఎవరూ వాడలేదు... పెనాల్టీ ఏరియా నుంచి కూడా గోల్‌ అందించగల ప్రమాదకరమైన ఫ్రీ కిక్‌ టెక్నిక్‌ మైదానంలో అభిమానులను ఉర్రూతలూగించింది.

‘నేను ఒక పెళ్లి వేడుకలో చక్కటి తెల్ల దుస్తులు వేసుకొని నిలబడ్డాను... ఆ సమయంలో బురదతో నిండిన ఒక ఫుట్‌బాల్‌ నావైపు వచ్చిందనుకోండి... నేను ఇంకేమీ ఆలోచించకుండా నా ఛాతీతో దానిని ఆపి వెంటనే కాలితో తన్నేందుకు సిద్ధమైపోతాను... ఆటపై అతనికి ఉన్న పిచ్చి అది... అతను ఫుట్‌బాల్‌ను ప్రేమించాడు... అదే ఊపిరిగా బతికాడు... సరిగ్గా చెప్పాలంటే మారడోనా ఫుట్‌బాల్‌ను శాసించాడు... అతని పాదాలకు బంతి అలంకారంగా మారిపోయింది... మారడోనా చెప్పినట్లుగా అది గజ్జెకట్టి ఆడింది.

ఆటగాడిగా శిఖరాలు అధిరోహించినా... పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి చేరినా... పదిసార్లు మృత్యువుకు చేరువగా వచ్చి వెనుదిరిగినా... మారడోనాను ఫుట్‌బాల్‌ ప్రపంచం ఎప్పుడూ మరచిపోలేదు... వివాదాలతో సహవాసం చేసిన రోజుల్లో, విషాదాలు వెంటాడిన సమయంలో అతనూ తన పోరాటం ఆపలేదు. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒకచోట చివరి శ్వాస వరకు ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించిన మాంత్రికుడు డీగో మారడోనా అలసిపోయాడు. డ్రగ్స్, ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లు... అన్నీ అధిగమిస్తూ వచ్చిన అతను చివరకు ఆరు పదుల వయసుకే స్వర్గంలో మరో మైదానాన్ని వెతుక్కుంటూ మరో ప్రపంచానికి వెళ్లిపోయాడు. వెలకట్టలేని జ్ఞాపకాలను అభిమానులకు అందించి నిష్క్రమించాడు.  

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (60) బుధవారం గుండెపోటుతో కన్నుమూశాడు. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవల మారడోనాకు శస్త్ర చికిత్స జరిగింది. నవంబర్‌ 12న కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నాడు. అయితే రెండు వారాల వ్యవధిలోనే అతను తుది శ్వాస విడిచాడు. అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్‌ డివిజన్‌ క్లబ్‌ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. ‘గోల్డెన్‌ బాయ్‌’గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం.  

అలా మొదలై...
ఎనిమిది మంది సంతానం ఉన్న పేద కుటుంబంలో మారడోనా ఐదోవాడు. ఫుట్‌బాల్‌పై పిచ్చితో ఆడుతూనే ఉండేవాడు. ఎనిమిదేళ్ల వయసులో స్థానికంగా జూనియర్‌ ట్రయల్స్‌ కోసం వెళ్లినప్పుడు అతని ఆటను చూసి కోచ్‌ ఫ్రాన్సిస్కో కార్నెజో అబ్బురపడ్డాడు. ఈ వయసులో ఇంత అద్భుత ఆటను ఎప్పుడూ చూడలేదంటూ ప్రోత్సహించి సరైన దిశలో నడిపించాడు. 16 ఏళ్ల వయసులో అర్జెంటీనోస్‌ జూనియర్‌ క్లబ్‌ జట్టుకు ఎంపిక కావడంతో అతని దశ తిరిగింది. ఆ తర్వాత ఎదురు లేకుండా దూసుకుపోయిన మారడోనా... సూపర్‌ స్టార్‌గా ఎదిగేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ప్రఖ్యాత క్లబ్‌లన్నీ రికార్డు మొత్తాలతో అతనితో కాంట్రాక్ట్‌లు కుదుర్చుకునేందుకు వెంట పడ్డాయి. బార్సిలోనా, నపోలీ జట్ల తరఫున అతను సాధించిన రికార్డులు అపూర్వం. మారడోనా రిటైర్మెంట్‌ తర్వాత నపోలీ క్లబ్‌ అతని ‘10’ నంబర్‌ జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ఇచ్చేసింది.  
విశ్వ వేదికపై...
1982లో మారడోనా తొలిసారి ప్రపంచ కప్‌ బరిలోకి దిగాడు. ఐదు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 1986 ప్రపంచకప్‌ అతడిని దిగ్గజంగా మార్చింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో కెప్టెన్‌గా, బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచి అర్జెంటీనాను చాంపియన్‌ను చేశాడు. 1990లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరి జర్మనీ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రభ తగ్గడం మొదలైంది. 1994 వరల్డ్‌ కప్‌లో కూడా ఆడినా... రెండు మ్యాచ్‌ల తర్వాతే డ్రగ్స్‌ ఆరోపణలతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’
మారడోనా కెరీర్‌ మొత్తానికి హైలైట్‌గా నిలిచిపోయిన మ్యాచ్‌ 1986 వరల్డ్‌ కప్‌లో జరిగింది. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా చేసిన గోల్‌ వివాదాస్పదమైంది. అతను తన చేత్తో బంతి నెట్టాడంటూ ఇంగ్లండ్‌ ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు మారడోనా... ‘నిజంగా చేతితో ఆ గోల్‌ చేసి ఉంటే అదో అదృశ్య హస్తం’ అంటూ బదులిచ్చాడు. చరిత్రలో ఇది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా నిలిచిపోయింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత తాను చేత్తోనే గోల్‌ చేశానంటూ మారడోనా బహిరంగంగా ఒప్పుకున్నా...అప్పటికే అది చరిత్రలో లిఖించిపోయింది. అయితే ఈ గోల్‌ చేసిన 4 నిమిషాలతో అతను చేసిన మరో అద్భుత గోల్‌ విలువను వెల కట్టలేం. 62 మీటర్ల దూరం కవర్‌ చేస్తూ, 10 సెకన్ల వ్యవధిలో 5 మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లను తప్పించుకుంటూ అతను చేసిన గోల్‌కు ప్రపంచం నివ్వెరపోయింది. 2002లో ‘ఫిఫా’ గోల్‌ ఆఫ్‌ ద సెంచరీ అంటూ దీనికి గుర్తింపునిచ్చింది. ఈ ప్రదర్శన మారడోనా ఘనతను ఎప్పటికీ నిలిచిపోయేలా చేసింది.   

► పుట్టిన తేదీ: అక్టోబర్‌ 30, 1960
► పుట్టిన స్థలం: బ్యూనస్‌ ఎయిర్స్, అర్జెంటీనా
► 1976 అర్జెంటీనా జూనియర్‌ జట్టులో స్థానం,  అరంగేట్రం
► 1977 అర్జెంటీనా సీనియర్‌ జట్టులో చోటు
► 1986 మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అర్జెంటీనాకు 2–1తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా ► సాధించిన రెండు గోల్స్‌ చరిత్రలో నిలిచిపోయాయి.  
► 1994 అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌ సందర్భంగా డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయాడు. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పంపించారు. 15 నెలలపాటు సస్పెన్షన్‌.
► 1997 రివర్‌ ప్లేట్‌ క్లబ్‌తో కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడాడు.
► 2000 కొకైన్‌ అడిక్షన్‌ నుంచి విముక్తికి క్యూబాలో రిహాబిలిటేషన్‌.
► 2005 సొంత టీవీ కార్యక్రమం నిర్వహించాడు.
► 2008–2010 రెండేళ్లపాటు అర్జెంటీనా జాతీయ సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2010 ప్రపంచకప్‌లో మారడోనా కోచ్‌గా ఉన్న అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.


ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా...
ఆడిన మ్యాచ్‌లు: 585
చేసిన గోల్స్‌: 311
గెలిచిన టైటిల్స్‌ 9


అర్జెంటీనా తరఫున...
ఆడిన మ్యాచ్‌లు  91
చేసిన గోల్స్‌  34


ఆడిన ప్రపంచకప్‌లు 4
1982: రెండో రౌండ్‌లో నిష్క్రమణ
1986: విజేత
1990: రన్నరప్‌
1994: ప్రిక్వార్టర్‌ ఫైనల్‌
 
నవంబర్‌ 25, 2020: గుండెపోటుతో బ్యూనస్‌ ఎయిర్స్‌లో కన్నుమూత
 


నవంబర్‌ 12న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వేళ...


(చదవండి: ‘కరోనా వైరస్‌’ ఓ పెద్ద మోసం: కతియా అవీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement