‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’ | Arjun Tendulkar Opens Up On Personal Life Dont Have Cricketer Friends | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’

Apr 1 2026 12:05 PM | Updated on Apr 1 2026 12:25 PM

Arjun Tendulkar Opens Up On Personal Life Dont Have Cricketer Friends

భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్‌ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. క్రికెట‌ర్ల‌లో త‌న‌కు స్నేహితులెవ‌రు లేరని, తన ఆరాధ్య క్రికెటర్‌ మా నాన్న సచిన్‌ టెండూల్కర్‌ ఎంతమాత్రం కాదని అర్జున్ చెప్ప‌డం ఆస‌క్తిగా అనిపించింది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ నుంచి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు ట్రేడ్ అయిన అర్జున్ ఇవాళ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌కు అవ‌కాశం వ‌స్తుందా? రాదా అన్న‌ది చూడాలి. 

ఈ నేప‌థ్యంలో శుభంక‌ర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు అర్జున్ టెండూల్క‌ర్ ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ‘మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు ’ అని అడిగిన ప్రశ్నకు అర్జున్ చాలా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘గోవాలోని నా ఇంట్లో ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటితో ఆడుకుంటూ సమయం గడుపుతాను. అదే నా ప్రశాంతతకు అసలు కారణం' అని అర్జున్ వివరించాడు. ఒత్తిడితో కూడిన క్రికెట్ ప్రపంచం నుండి దూరంగా ఉండటానికి ఈ మూగజీవాలు తనకు ఎంతో సహాయం చేస్తాయని తెలిపాడు.

సాధారణంగా ఆటగాళ్లకు ఎక్కువగా తోటి క్రికెటర్లే స్నేహితులుగా ఉంటారు. కానీ అర్జున్ మాత్రం తాను ఇందుకు విరుద్ధమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నాకు నిజంగా క్రికెటర్ స్నేహితులు లేరు. నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి క్రికెట్‌తో పెద్దగా పరిచయం కూడా లేదు. అందుకే నేను వారితో కలిసినప్పుడు అస్సలు క్రికెట్ గురించి మాట్లాడను’ అని చెప్పాడు. దీనివల్ల ఆట నుంచి తనకు మంచి విరామం దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు.

క్రికెట్ దిగ్గజం కుమారుడు కావడంతో అర్జున్ టెండూల్కర్ తరచూ విమర్శలకు గురవ్వడం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ‘విమర్శలంటే మీకు భయమా?’ అని అడిగిన ప్రశ్నకు, అర్జున్ ఏమాత్రం తడబడకుండా.. ‘లేదు, నాకు అస్సలు భయం లేదు’ అని చాలా ధీమాగా సమాధానమిచ్చాడు. ఇక తన ఫేవరెట్ క్రికెటర్ తన నాన్న సచిన్ టెండూల్కర్ కాదని, మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ఆరాధ్య క్రికెటర్ అని పేర్కొనడం విశేషం. అతని బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ తన తండ్రిలా మాత్రం టీమిండియాలో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. తండ్రి అండతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు పలు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. IPL-2026 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లాడిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IPL 2026: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement