Neeraj Chopra: Biography In Telugu, Life Story From Army Suberar To Gold Medal - Sakshi
Sakshi News home page

Neeraj Chopra Gold Medal: ఆర్మీ సుబేదార్‌ నుంచి స్వర్ణ విజేతగా

Published Sat, Aug 7 2021 8:34 PM | Last Updated on Sun, Aug 8 2021 11:58 AM

Army Subedar To Gold Medal At Tokyo Olympics Neeraj Chopra Life Journey - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆటలాడటం.. యుద్ధం చేయడం దాదాపు రెండు ఒకలాంటివే. రెండింటిలోనూ విజయం సాధించడం అంత సులవేం కాదు. అందుకే అటు సైనికుడు.. ఇటు ఆటగాడు.. ఇరువురు ప్రతినిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తమలోని పోరాట యోధునికి.. క్రీడాకారుడికి పదునుపెట్టుకుంటునే ఉంటారు. యుద్ధంలోనూ, ఇటు క్రీడల్లోను సాధించే విజయాన్ని దేశం మొత్తం ఆనందిస్తుంది. ప్రతి భారతీయుడు.. తానే గెలిచినట్లు సంబరాలు చేసుకుంటాడు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇదే దృశ్యం కనిపిస్తుంది. ఒలింపిక్స్‌లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఓ సైనికుడు చూపిన అసమాన ప్రతిభకు స్వర్ణం లభించింది. 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో.. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డోన్‌ ముగింపు పలికాడు. ఆర్మీ సుబేదార్‌ నుంచి స్వర్ణం విజేతగా నీరజ్‌ చోప్రా ప్రస్థానం ఇది..

హరియాణాలోని పానీపత్‌ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్‌ చోప్రా(23) వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవయం చేస్తూ.. జీవనం సాగించేవారు. బాల్యంలో నీరజ్‌ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే.. 12 ఏళ్లకే 90కిలోల బరువు ఉన్నాడు. అంత చిన్న వయసులో.. ఇంత భారీగా బరువు పెరగడం పట్ల నీరజ్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బరువు తగ్గించడం కోసం ఇంట్లో వాళ్లు ఎక్సర్‌సైజ్‌ చేయమని ఎంత చెప్పినా నీరజ్‌ వినేవాడు కాదట. 

నీరజ్‌ జీవతంలోకి జావెలిన్‌ త్రో ప్రవేశం.. 
ఈ క్రమంలో ఓ సారి నీరజ్‌ అంకుల్‌ భీమ్‌ చోప్రా అతడిని పానీపత్‌ స్టేడియంలో జాగింగ్‌ చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడే అతడికి జావెలిన్‌ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్‌ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే.. అంత భారీశరీరం ఉన్నప్పటికి కూడా నీరవ్‌ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. జావెలిన్‌ త్రో గురించి ఏ మాత్రం తెలియకపోయినప్పటికి.. నీరజ్‌ మొదటి ప్రయత్నంలోనే 35-40 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడట. ఇది గమనించిన జై చౌధరీ.. నీరజ్‌లో పుట్టుకతోనే ప్రతిభ ఉందని అనుకున్నాడు. దీని గురించి జై చౌధరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్‌ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే నీరజ్‌ జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఓ సారి పేపర్‌లో నీరజ్‌ ఫోటో రావడంతో అప్పుడు దీని గురించి వారికి తెలిసింది. అప్పటి వరకు జావెలిన్‌ త్రో అనే ఆట ఉందనే విషయమే అతడి కుటుంబ సభ్యులకు తెలియదు.

ఆర్థికంగా కష్టమైన.. ఆసక్తిని కాదనలేక..
అప్పటికే నీరజ్‌ జావెలిన్‌ త్రో పట్ల మమకారాన్ని పెంచుకున్నాడు. అయితే నీరజ్‌ను ఆ రంగంలో ప్రోత్సాహించడం అతడి కుటుంబానికి ఆర్థికంగా చాలా కష్టం. అయినప్పటికి నీరజ్‌ ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్‌ జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్‌ క్యాంప్‌ నుంచి నీరజ్‌కు పిలుపు వచ్చింది. 

మొదలైన పతకాల వేట...
నేషనల్‌ క్యాంప్‌లో చేరిన తర్వాత నీరజ్‌ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఇక 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2016 జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2016 గౌహతిలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలు, 2017 భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సింగ్‌లో జరుగుతున్న ఆసియా గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్‌ రెండో దశలో నీరజ్ రజత పతకాన్ని సాధించాడు. 2018 లో, అతను జకార్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు.

చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన 2019..
నీరజ్‌ కెరీర్‌లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే.. భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్‌ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. తనలో ఎలాంటి మార్పూ రాలేదని నిరూపిస్తూ.. ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. 2020లో ఒలింపిక్‌ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 2021లో జరిగిన జావెలిన్‌ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలుకొట్టాడు. 

ఒలింపిక్స్‌ కోసం కఠోర శిక్షణ..
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్‌ చోప్రా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్‌.. ఆస్ట్రేలియా కోచ్‌ గారీ కాల్వర్ట్‌ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం జర్మన్ బయో మెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనియెట్జ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి.. తన కలను నెరవేర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడినే కాదని.. తన విజయానికి కారణం వారే అంటాడు నీరజ్‌. ప్రస్తుతం అతడు ఇండియన్ ఆర్మీలో 4 రాజ్‌పుతానా రైఫిల్స్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నీరజ్‌ చోప్రా చండీగఢ్‌లోని డీఏవీ కళాశాలలో గ్రాడ్యుయేన్‌ పూర్తి చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement