The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది.
స్టోక్స్ దూకుడు
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.
గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
రెండు వికెట్లు పడగొట్టి
ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్‌ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్‌కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment