దుబాయ్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్‌ను ఈ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నప్పటికీ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన అశ్విన్‌వైపే ఐసీసీ మొగ్గుచూపింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీసిన అశ్విన్.. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ కూడా సాధించాడు. ఒక సిరీస్‌లో 30కిపైగా వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది రెండోసారి. అంతేకాదు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ఇండియన్ బౌలర్ కూడా అశ్వినే కావడం విశేషం.
కాగా, టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించినట్లు ఐసీసీ తన ట్వీటర్ ఖాతాలో పేర్కొంది. ఐసీసీ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను జనవరి నెలకుగాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎగురేసుకుపోగా, ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను అశ్విన్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment