
IND VS PAK: ఆసియా కప్ 2022లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 28) జరుగనున్న హైఓల్టేజీ పోరుకు (భారత్-పాక్ మ్యాచ్) ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు ఆరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 117 పరుగులు చేస్తే ఆసియా కప్‌లో మరే భారత క్రికెటర్‌కు సాధ్యం కాని 1000 పరుగుల రికార్డును చేరుకుంటాడు. ప్రస్తుతం రోహిత్ 27 మ్యాచ్‌ల్లో 883 పరుగులు సాధించాడు.
రోహిత్ 1000 పరుగుల రికార్డును సాధించే క్రమంలో (89 పరుగుల వద్ద) భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ను (23 మ్యాచ్‌ల్లో 971 పరుగులు) అధిగమిస్తాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (25 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కర (24 మ్యాచ్‌ల్లో 1075 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. ఆతర్వాతి స్థానాల్లో సచిన్, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ (21 మ్యాచ్‌ల్లో 907), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (16 మ్యాచ్‌ల్లో 766) వరుసగా ఉన్నారు.
ఈ రికార్డుతో పాటు హిట్‌మ్యాన్ మరో అరుదైన రికార్డుకు కూడా ఎసరు పెట్టాడు. ఆసియాకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు మరో 6 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఆసియాకప్‌లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (26 మ్యాచ్‌ల్లో 27 సిక్సర్లు) పేరిట ఉంది. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 21 సిక్సర్లు (27 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీలంక మాజీ విధ్వంసకర ఆటగాడు జయసూర్య (23 మ్యాచ్‌ల్లో 25) రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ మూడులో, సురేశ్ రైనా (18 మ్యాచ్‌ల్లో 18), ధోని (24 మ్యాచ్‌ల్లో 16) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
చదవండి: Asia Cup: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం..