భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉండే వాతావరణం. ఎవరితో ఓడినా ఇక్కడ మాత్రం ఓడరాదనే కసి... నాటి ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకుపోవడం, మాటల తూటాలు, టీవీ చానళ్లలో తీవ్ర చర్చ...
ఇదంతా ఒకప్పటి మాట! గత కొంత కాలంగా చూస్తే ఆటగాళ్లు మధ్య స్నేహాలు, ప్రత్యేక పలకరింతలు, పరస్పర అభినందనలు, అవతలి జట్టు అభిమానులతో లెక్క లేనన్ని సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లకు సిద్ధమైపోతూ ఈ పోరు తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇదంతా చూసి మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదని అనుకోవద్దు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిలో మాత్రం మార్పు రాలేదు. స్టేడియంలో అన్ని టికెట్లు 10 రోజుల ముందే అమ్ముడుపోయాయి. టోర్నీలో ఇతర మ్యాచ్‌లకు 400 దిర్హమ్‌లు (సుమారు రూ.8,700)కు అమ్ముడుపోయే టికెట్ ఈ మ్యాచ్ కోసం 6000 దిర్హమ్‌లు (సుమారు 1 లక్షా 30 వేలు) పలికింది. నాలుగు గంటల వినోదం అంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు భారత్ నుంచి దుబాయ్‌కు ప్రత్యేక విమానాల్లో ట్రిప్‌లు కూడా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో వారాంతంలో భారత్, పాక్ అభిమానులకు ఆనందం పంచనుంది.
దుబాయ్: ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్ మధ్య మ్యాచ్‌పై ఆసక్తికి కారణమవుతోంది. గత ఏడాది ప్రపంచకప్‌లో అభిమానుల అంచనాలకు విరుద్ధంగా ఇదే వేదికపై పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడింది. సుమారు పది నెలల విరామం తర్వాత ఇప్పుడు రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. స్వల్ప మార్పులు మినహా దాదాపు ఆ ఆటగాళ్లే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈసారి టీమిండియా పైచేయి సాధిస్తుందా లేక పాక్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా చూడాలి.
కోహ్లిపైనే దృష్టి...
టి20ల్లో గత కొంత కాలంగా భారత్ ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో పెద్దగా అనూహ్య మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే విశ్రాంతి తర్వాత సీనియర్లు పునరాగమనం చేయడంతో ఇటీవల రాణించిన కుర్రాళ్లను కూడా తప్పనిసరిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా, మూడో స్థానంలో కోహ్లి సత్తా చాటాల్సి ఉంది. రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే పాక్‌కు కష్టాలు తప్పవు. ఇటీవల జింబాబ్వేతో వన్డేల్లో బరిలోకి దిగిన రాహుల్‌కు ఐపీఎల్ తర్వాత ఇదే తొలి టి20 మ్యాచ్. సుదీర్ఘ కాలంగా ఆశించిన స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లి తన స్థాయికి తగిన ప్రదర్శన చేయాల్సి ఉంది.
మిడిలార్డర్‌లో సూర్యకుమార్, పంత్, పాండ్యా దూకుడైన బ్యాటింగ్ భారత్‌కు అదనపు బలం. ఏడో స్థానంలో జడేజా కూడా సత్తా చాటితే తిరుగుండదు. గాయంతో బుమ్రా, హర్షల్ దూరం కావడంతో సీనియర్‌గా భువనేశ్వర్‌పై అదనపు భారం ఉంది. అర్‡్షదీప్‌కు కూడా చోటు ఖాయం. లెగ్‌స్పిన్నర్ చహల్ ప్రత్యర్థిని కట్టి పడేయగలడు. రెండో స్పిన్నర్‌గా అశ్విన్, బిష్ణోయ్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉండగా...పిచ్ పరిస్థితి బట్టి వీరిద్దరు కాకుండా మూడో పేసర్ అవేశ్‌కు కూడా చాన్స్ దక్కవచ్చు. ఎలా చూసినా పాకిస్తాన్‌తో పోలిస్తే మన జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
వారిద్దరు మినహా...
పాకిస్తాన్ బ్యాటింగ్ భారం ప్రధానంగా ఇద్దరిపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్, కీపర్ రిజ్వాన్ చాలా కాలంగా ఓపెనర్లుగా జట్టుకు మంచి విజయాలు అందించారు. గత ఏడాది కూడా భారత్‌పై విజయంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. అయితే 152 లక్ష్యంతోనే బరిలోకి దిగిన నాటి వ్యూహం ఈసారి పని చేయకపోవచ్చు. వీరిద్దరు కూడా విధ్వంసకర బ్యాటర్లు కాదు. సాధారణ స్ట్రయిక్‌రేట్‌తో మాత్రమే ఆడగలరు.
మూడో స్థానంలో ఫఖర్ జమాన్ కాస్త దూకుడైన ప్లేయర్. ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా నిరూపించుకున్నది లేదు. ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్‌దిల్, నవాజ్ ఏమాత్రం ప్రభావం చూపగలరో చెప్పలేం. షాహిన్ అఫ్రిది దూరం కావడం పాక్ బౌలింగ్‌ను బలహీనంగా మార్చింది. రవూఫ్‌తో పాటు నసీమ్ షా, హస్‌నైన్‌లపైనే జట్టు ఆధారపడుతోంది. ఉస్మాన్ ఖదీర్ రూపంలో రెగ్యులర్ స్పిన్నర్ టీమ్‌లో ఉన్నాడు.
విరాట్ కోహ్లికిది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ కానుంది. మూడు ఫార్మాట్‌లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్‌గా (న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ తర్వాత) అతను ఘనత సాధిస్తాడు.
భారత్, పాక్ మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’ అయింది.
Comments
Please login to add a commentAdd a comment