
దినేశ్ కార్తిక్- రిషభ్ పంత్(PC: BCCI/AFP)
డీకే వద్దు.. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే: సబా కరీం
Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఆసియా కప్-2022 ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా ఆగష్టు 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఆసియా కప్ ట్రోఫీని అందుకున్న జట్టుకు టీమిండియాకు పేరున్న విషయం తెలిసిందే.
భారత జట్టు ఇప్పటివరకు అత్యధిక ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఇక ఈసారి కూడా ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు జట్టులో చోటుదక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానైతే తుది జట్టులో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తిక్‌కు మాత్రం అవకాశం ఇవ్వనని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌కే ఆ ఛాన్స్ ఇస్తానని స్పష్టం చేశాడు. మెగా టోర్నీలో పంత్ టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్(కీలక ఆటగాడు) కాగలడని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచి వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ భారత జట్టులోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంత్‌తో పాటు డీకేకు కూడా వికెట్ కీపర్‌గా అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సబా కరీం స్పోర్ట్స్ ఓవర్ ది టాప్ షోలో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో ఒకే ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఉండాలి కదా! కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్ ఎంతో కీలకం. కాబట్టి దినేశ్ కార్తిక్ బదులు నేను పంత్‌కే నా జట్టులో స్థానం ఇస్తాను. టీమిండియాలో తను కీలక బ్యాటర్. ఈ టోర్నీలో అతడు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడని భావిస్తున్నా’’ అని తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఈ మెగా టోర్నీ ఆడటం అతడికి ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు.
చదవండి: Rohit Sharma: షాట్లతో అలరించిన రోహిత్, కోహ్లి! మరీ ఇంత హైప్ అవసరం లేదు!
ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్! ముందు అరంగేట్రం చేయనివ్వు!