Asia Cup 2023: షాకింగ్‌.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఎన్నడూ లేని దుస్థితి..! | Asia Cup 2023: Empty Stands In India Vs Pakistan Super 4 Clash In Sri Lanka | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: షాకింగ్‌.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఎన్నడూ లేని దుస్థితి..!

Published Sun, Sep 10 2023 5:21 PM | Last Updated on Sun, Sep 10 2023 5:27 PM

Asia Cup 2023: Empty Stands In India Vs Pakistan Super 4 Clash In Sri Lanka - Sakshi

ఆసియా కప్‌-2023 భాగంగా కొలొంబో వేదికగా భారత్‌-పాక్‌లు ఇవాళ (సెప్టెంబర్‌ 10) సూపర్‌-4 సమరంలో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పాక్‌ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత వీరిరువురు ఔటయ్యారు. 24.1 ఓవర్ల తర్వాత వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. ఈ సమయానికి టీమిండియా స్కోర్‌ 147/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ అఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఈ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ అభిమానులకు ఎన్నడూ తారసపడని పలు ఆసక్తికర దృశ్యాలు తారసపడ్డాయి. ఈ దృశ్యాలు అసలుసిసలు క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా కలచివేశాయి. సాధారణంగా దాయాదుల సమరం ప్రపంచంలోని ఏ మూలలో జరిగినా ఇసకేస్తే రాలనంత జనం స్టేడియాలకు తరలివస్తారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది కాదనలేని సత్యం. అలాంటిది ఇవాల్టి భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కనీస జనం కూడా స్టేడియానికి రాకపోవడం క్రికెట్‌ అభిమానులను నివ్వెరపోయేలా చేస్తుంది. మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యాక స్టేడియంలో తారసపడిన ఖాళీ స్టాండ్స్‌ ఫ్యాన్స్‌ను విస్తుపోయేలా చేస్తున్నాయి.

పలు నివేదికల ప్రకారం స్టేడియంలో 15000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం​. క్రికెట్‌ చరిత్రలో ఇది షాకింగ్‌ పరిణామం. మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు టికెట్ల రేట్లు తగ్గించినా, జనాలు స్టేడియాలకు రాకపోవడం ఫ్యాన్స్‌ను మరింత బాధిస్తుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వర్షమే అయినప్పటికీ, భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు మరీ ఇంతటి దుస్థితిని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్‌ క్రీడల చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ఈ దుస్థితి రావడంపై రకరకాలు స్పందిస్తున్నారు. ఈ పరిణామంతో  ఓ మనిషి జీవితంలో చూడాల్సినవన్నీ చూసేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement