ఆసియా కప్-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన కీలక సూపర్-4 సమరంలో పాక్.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. కీలక ఆటగాళ్లంతా గాయపడినా, ఓ మోస్తరు స్కోర్ చేసి చివరి నిమిషం వరకు పోరాడినా, పాక్ లంకపై గెలువలేకపోయింది. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కోల్పోయింది.
ఇవాళ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోగా.. సౌతాఫ్రికా చేతిలో మూడో వన్డేలో ఓడినప్పటికీ రెండో ప్లేస్‌లో ఉండిన ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. పాక్ మూడో స్థానానికి పడిపోవడంతో ఆ స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. టాప్-3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (118), భారత్ (116), పాకిస్తాన్ (115)ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 3 పాయింట్లే ఉండటంతో అగ్రస్థానం ఈ మూడు జట్ల మధ్య దోబూచులాట ఆడుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచి, సౌతాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోతే, వరల్డ్‌కప్‌లో భారత్ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగుతుంది. వన్డేల్లో భారత్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధిస్తే.. ఒకేసారి మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంకింగ్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. భారత్ ఇప్పటికే టెస్ట్‌ల్లో, టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా చలామణి అవుతుంది.
ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై గెలవడంతో శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుని, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-4 దశలో శ్రీలంక.. పాక్, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడగా.. భారత్.. పాక్, శ్రీలంకను ఓడించి, ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 78/4గా ఉంది. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. షకీబ్ (34), తౌహిద్ హ్రిదోయ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment