ఇటీవలికాలంలో భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల ఆన్ ఫీల్డ్ బిహేవియర్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. ఇరు దేశాల ఆటగాళ్లు మైదానంలో ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇరు దేశాల ఆటగాళ్లు ఆఫ్ ద ఫీల్డ్ విషయాలు పక్కకు పెట్టి ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు.
ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ.. అభిప్రాయాలు, అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. పాక్ ఆటగాళ్లు వారి దేశంలో నూరిపోస్తున్న వైషమ్యాలను పక్కకు పెట్టి, అనుభవజ్ఞులైన భారత ఆటగాళ్ల దగ్గర సలహాలు తీసుకుంటున్నారు. భారత్-పాక్ ఆటగాళ్ల మధ్య ఇలాంటి వాతావరణం చూడముచ్చటగా ఉంది.
గతంలో ఇరు దేశాల క్రికెటర్ల మధ్య ఇలాంటి వాతావరణం కనిపించేది కాదు. ఆన్ ఫీల్డ్‌లో ఇరు దేశాల క్రికెటర్లు ఒకరినొకరు కవ్వించుకునే వారు. కయ్యాని కాలు దువ్వే వారు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు సైతం శ్రుతిమించి గొడవల దాకా వెళ్లాయి.
1992 వరల్డ్‌కప్‌లో కిరణ్ మోరే-జావిద్ మియాందాద్ ఉదంతం, 1996 వరల్డ్‌కప్‌లో ఆమీర్ సొహైల్-వెంకటేశ్ ప్రసాద్ ఇష్యూ, 2007లో గంభీర్-అఫ్రిది మధ్య మాటల యుద్దం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గొడవలు కాస్త చినికిచినికి గాలివానలా మారి ఇరు దేశాల ఆటగాళ్లు, అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.
అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహపూరితంగా మెలుగుతున్నారు. కయ్యాలకు స్వస్తి పలికి, ఆటను ఆటలా ఆస్వాధిస్తున్నారు. ఈ వాతావరణం ఏర్పడటానికి ముఖ్య కారణం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్న విషయాన్ని అందరూ అంగీకరించాలి.
విరాట్ గత మూడు నాలుగేళ్లుగా మైదానంలో పాక్ ఆటగాళ్లతో ఎంతో కలుపుగోలుగా ఉంటున్నాడు. 2021 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా విరాట్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌తో ఆప్యాయంగా వ్యవహరించిన తీరు ఇరు దేశాల క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
తాజాగా ఆసియా కప్-2023లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా కూడా విరాట్ చాలా మెచ్చూర్డ్‌గా బిహేవ్ చేసి, విమర్శకుల ప్రశంసలను అందున్నాడు. మ్యాచ్‌కు ముందు పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌ను ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరలైంది. మ్యాచ్ అనంతరం భారత్-పాక్ ఆటగాళ్లు ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ, ఆలింగనం చేసుకున్న దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Moment of the day.
— Johns. (@CricCrazyJohns) September 1, 2023
Virat Kohli meets Haris Rauf ahead of the Asia Cup. [Star Sports] pic.twitter.com/WDnZVIo1kp
ముఖ్యంగా విరాట్.. పాక్ ఆటగాళ్లందరితో కలుపుగోలుగా ఉండటం చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కోపిష్టి విరాట్ ఇలా మారిపోయాడేంటని అనుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ భారత్-పాక్ ఆటగాళ్లు ఇలా కలిసి మెలిసి ఉండటం చూడముచ్చటగా ఉంది. భవిష్యత్తులోనూ ఇదే వాతావరణం కొనసాగాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment