హార్దిక్ పాండ్యా- ఇషాన్ కిషన్ (PC: BCCI)
Asia Cup 2023 Ind Vs Pak- Ishan Kishan and Hardik Pandya Record: పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా ద్వయం సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ చరిత్రలో ఇప్పటిదాకా రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాగా శ్రీలంక వేదికగా ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మ్యాచ్ జరుగుతోంది.
పాక్ పేసర్ల జోరు.. టీమిండియా టాపార్డర్ బేజారు
ఈ వన్డే టోర్నీ తాజా ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా ధాటికి టీమిండియా టాపార్డర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఇషాన్, పాండ్యా అర్ధ శతకాలతో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.
ఆదుకున్న ఇషాన్- హార్దిక్..
వీరిద్దరి విజృంభణతో భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్(82)- హార్దిక్ పాండ్యా(87) ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసియా కప్ ఈవెంట్లో ఐదో వికెట్‌కు టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు.
ద్రవిడ్- యువీ రికార్డు బద్దలు
ఈ క్రమంలోనే ఇషాన్- పాండ్యా 19 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. కాగా 2004లో ద్రవిడ్(82)- యువీ(47) శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. పాక్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ రికార్డును అధిగమించారు.
ఆ రికార్డు కూడా బ్రేక్
అంతేకాదు.. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జోడీగా రాహుల్ ద్రవిడ్- మహ్మద్ కైఫ్‌ల రికార్డు(135)ను బద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. పాక్‌తో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిదికి నాలుగు, రవూఫ్, నసీం షాలకు చెరో మూడు వికెట్లు దక్కాయి.
ఆసియా కప్ చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన టాప్-4 జోడీలు
►ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా- 2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 138 పరుగులు
►రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్- 2004లో శ్రీలంకతో మ్యాచ్‌లో 133 పరుగులు
►ధోని- రోహిత్ శర్మ- 2008లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 112 పరుగులు
►ధోని- రోహిత్ శర్మ- 2010లో శ్రీలంకతో మ్యాచ్‌లో 79 పరుగులు.
చదవండి: IND VS PAK: షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంది ఇందుకేనా..?
Comments
Please login to add a commentAdd a comment