
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన పాక్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
అత్యంత వేగంగా 19 వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా..
వన్డే క్రికెట్‌లో బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బాబర్‌కు 19 సెంచరీలు సాధించేందుకు కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇంత వేగంగా 19 సెంచరీల మార్కును అందుకోలేదు. బాబర్‌కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. రన్ మెషీన్ విరాట్ కోహ్లి 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీల మార్కును అందుకున్నారు.
కాగా, నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేసి ఔటయ్యాడు.