ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ విధ్వంసకర శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్.. కేవలం 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో పాక్ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్ అలీ (67 బంతుల్లో) రికార్డును సమం చేశాడు.
వన్డేల్లో పాక్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో) పేరిట ఉంది. ఆతర్వాత రెండు (45), మూడు (53) ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ రికార్డులు కూడా అతని ఖాతాలోనే ఉన్నాయి. పాక్ తరఫున వన్డేల్లో నాలుగో వేగవంతమైన శతకం షర్జీల్ ఖాన్ (61) పేరిట ఉంది.
ఇదిలా ఉంటే, ఇఫ్తికార్‌తో పాటు బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా రికార్డు శతకంతో కదంతొక్కడంతో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ (342/6) చేసింది. 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అలాగే ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‌గా (151), వన్డేల్లో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసిన ఆటగాడిగా, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment