గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జరుగనున్న ఆసియా కప్‌లో రాహుల్‌ను తుది జట్టులో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాడికి నేరుగా తుది జట్టులో స్థానం కల్పించాలని అనుకుంటే, అది అతని నుంచి అతిగా ఆశించినట్లవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇది చాలదన్నట్లు మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆటగాడికి వికెట్‌కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుందని అన్నాడు. గాయాల నుంచి కోలుకునే ఆటగాళ్ల విషయంలో బీసీసీఐకి అంత తొందర అవసరం లేదని తెలిపాడు.
ఇలా చేస్తే ఆటగాళ్ల నుంచి దీర్ఘకాల ఫలితాలు పొందలేమని, వారి కెరీర్‌లకు అర్ధాంతరంగా పుల్‌స్టాప్ పడుతుందని హెచ్చరించాడు. బుమ్రా విషయంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే, అతను 14 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడని గుర్తు చేశాడు. రాహుల్ విషయంలో అంత తొందరేమీ లేదని, వరల్డ్‌కప్ సమయానికి అతను 100 శాతం ఫిట్‌గా ఉంటే చాలని.. ఆసియా కప్‌లో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. టాప్-7లో తాను ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని, తిలక్ తుది జట్టులో ఉంటే, అది సాధ్యపడుతుందని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో జరిగిన ఓ ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా శాస్త్రి ఈ మేరకు అభిప్రాయపడ్డాడు.
కాగా, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆసియాకప్-2023తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జట్టులోకి తీసుకుంటే ఈ ఇద్దరిని తప్పక బరిలోకి దించాల్సి ఉంటుంది. అందులో టీమిండియాకు రెగ్యులర్ వికెట్‌కీపర్ కూడా లేడు కాబట్టి, రాహుల్‌కు మించిన బెటర్ ఆప్షన్ కెప్టెన్‌కు ఉండదు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment