Asia Cup 2023- India vs Pakistan: టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఆసియా కప్ చరిత్రలోనే లేదని.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా చిరకాల ప్రత్యర్థులను ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో చూసే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.
పాక్‌ను చిత్తు చేసి.. లంకను జయించి
ఆసియా కప్-2023లో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్, గ్రూప్- బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ఆపై శ్రీలంక మీద జయభేరి మోగించింది.
తద్వారా ఈ వన్డే టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన బాబర్ ఆజం బృందం.. నెట్ రన్‌రేటు పరంగా లంక కంటే వెనుకబడి ఉంది.
గాయాలు, వర్షం.. పాక్‌ను వెంటాడుతున్న దురదృష్టం
ఈ క్రమంలో చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో గురువారం కొలంబో వేదికగా లంకతో పోటీపడనుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయపడటంతో డీలా పడిన పాక్ జట్టు.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే!
రిజర్వ్ డే అయినా.. ఇంకేదైనా ఇది జరగదంతే
అప్పుడు.. టీమిండియాతో పాటు.. శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శ్రీలంక- పాక్ మ్యాచ్ పరిస్థితులను గమనిస్తే.. విషయం పూర్తిగా అర్థమైపోతోంది కదా!
ఇండియా- పాకిస్తాన్‌ను ఫైనల్‌కు పంపించాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా.. ఆ రెండు తుదిపోరులో పరస్పరం ఢీకొట్టడం టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు కూడా అనుకూలించవు! అదంతే!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
భారత్- పాక్‌ను ఫైనల్ చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఈ కామెంటేటర్.. ‘‘ఈ గ్రూప్‌లో నేపాల్‌ను ఎవరు చేర్చమన్నారు. మొత్తంగా ఆరు జట్లున్న రెండు గ్రూప్‌ల నుంచి నాలుగు సూపర్ 4కి చేరతాయి కదా.. ఆపై రెండు జట్లు ఫైనల్‌కు!
కానీ.. మిగతా మ్యాచ్‌లకు కాదని కేవలం ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కే రిజర్వ్ డే కేటాయించడం చూస్తుంటే.. కచ్చితంగా ఇది కేవలం ఈ రెండు జట్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లా అనిపించడంలో తప్పులేదు’’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వివక్షపూరిత వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
చరిత్రలోనే లేదు.. పాక్ ఓటమి ఖాయమే!
ఇక హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి స్టార్ పేసర్ల గైర్హాజరీ.. దాంతో పాటు వర్ష సూచనలు పాక్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లడం ఖాయమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా 1984లో మొదలైన ఆసియా కప్ చరిత్రలో దాయాదులు భారత్- పాక్ ఫైనల్లో తలపడ్డ దాఖలాలు లేవు.
ఇక రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో టీమిండియా అత్యధికంగా ఏడుసార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్ గెలిచాయి. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ చాంపియన్‌గా శ్రీలంక తన పేరును చరిత్రలో లిఖించుకుంది.
చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Comments
Please login to add a commentAdd a comment