పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్‌  | Asian Games 2023: Afghanistan Beat Pakistan To Face Team India In Final | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్‌ 

Published Fri, Oct 6 2023 3:10 PM | Last Updated on Fri, Oct 6 2023 3:45 PM

Asian Games 2023: Afghanistan Beat Pakistan To Face Team India In Final - Sakshi

Asian Games Mens T20I 2023- Pakistan vs Afghanistan, Semi Final 2: ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన  పాక్‌ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్‌ మెడల్‌ రేసు నుంచి పాక్‌ క్రికెట్‌ బృందం నిష్క్రమించింది. మరోవైపు.. అఫ్గన్‌ టీమ్‌ ఈ విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది.


115 పరుగులకే ఆలౌట్‌
చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో సెమీఫైనల్లో పిన్‌ఫెంగ్‌ క్యాంపస్‌ క్రికెట్‌ ఫీల్డ్‌ వేదికగా పాకిస్తాన్‌- అఫ్గనిస్తాన్‌ పోటీపడ్డాయి. టాస్‌ గెలిచిన అఫ్గన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ 18 ఓవర్లకే చాపచుట్టేసింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఒమైర్‌ యూసఫ్‌ 24 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గన్‌ బౌలర్లలో కెప్టెన్‌ గులాబదిన్‌, కరీం జనత్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. ఫరీద్‌ అహ్మద్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఫైనల్‌కు చేర్చి
కైస్‌ అహ్మద్‌, జహీర్‌ ఖాన్‌ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్‌ 5, మహ్మద్‌ షాజాద్‌ 9 పరుగులకే అవుటయ్యారు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ నూర్‌ అలీ జద్రాన్‌ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్‌ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 18వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫోర్‌ బాది అఫ్గనిస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 

పసిడి కోసం టీమిండియాతో పోటీ
ఇక పాక్‌తో మ్యాచ్‌లో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్తాన్‌ ఫైనల్‌లో టీమిండియాను ఢీకొట్టనుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ ఉదయం 11.30 నిమిషాలకు ఆరంభమవుతుంది.

కాంస్యం కోసం బంగ్లాతో పాక్‌ పోరు
కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా గోల్డ్‌ మెడల్‌ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్‌ ఫైనల్స్‌లో ఓడిన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది.

చదవండి: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్‌ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement