సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది.
చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే..
6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్‌ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్‌లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్‌వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది.
శాయ్ సెంటర్‌లో శిక్షణ..
జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్‌లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్‌లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్‌లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది.
తండ్రే తొలి గురువు..
జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్‌లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు.
అంతర్జాతీయ పతకమే లక్ష్యం
జూలైలో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను.
– దండి జ్యోతికశ్రీ, అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment